ఖైదీ నెంబర్ 150 కాదు కానీ, మెగాభిమానుల జేబులకు బాగానే చిల్లు పడుతున్నట్లు బోగట్టా. విజయవాడలో తలపెట్టిన ఫంక్షన్ వాయిదా పడింది. కానీ ఈ సభ ఏర్పాట్లు, దానికి జన సమీకరణ, సిటీ అంతా కట్ అవుట్ లు, బ్యానర్లు ఏర్పాటు తదితర అంశాలపై పలు మీటింగ్ లు జరిగాయి. ఈ మీటింగ్ లు సాదా సీదాగా జరగలేదు. అలా అని డిస్కషన్లు ఫోన్లలో నడవలేదు. సమావేశాలు అన్నీ మాంచి మాంచి హోటళ్లలోని సమావేశ మందిరాల్లో జరగడం విశేషం.
మరి ఇలాంటి చోట్ల సమావేశాలు నిర్వహించాలంటే కనీసం వేలల్లో ఖర్చు అవుతుంది. మరి ఈ ఖర్చును ఎవరు భరించారన్నది మాత్రం తెలియడం లేదు. సమావేశాలకు మెగా ఫ్యాన్స్ స్టేట్ లీడర్లు ఆధ్వర్యం వహించారు. మరి వారు భరించారా? లేక లోకల్ అభిమానులపై మోపారా? అన్న విషయంలో ఇంకా వార్తలు బయటకు రాలేదు. ఫోటోలు మాత్రమే బయట చలామణీ అవుతున్నాయి.
ఎంత అభిమానం వున్నా, ఎంత బాస్ ఈజ్ బ్యాక్ అనుకుని ఆనందించినా, ఈ ఖర్చులేమిటా? అని మెగాభిమానుల్లోనే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పోనీ మెగాస్టార్ నుంచే ఖర్చులు అందుతున్నాయేమో అని ఎవరైనా ఎదురు అనుమానం వ్యక్తం చేస్తే, అంత సీన్ వుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అభిమానులే అందరూ కలిసి ఈ ఖర్చును భరిస్తున్నారని అంటున్నారు.