Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నందులొస్తున్నాయ్‌.. రాజకీయం కూడా.!

నందులొస్తున్నాయ్‌.. రాజకీయం కూడా.!

తెలుగు సినీ పరిశ్రమలో 'నంది'కి ప్రత్యేకమైన స్థానం వుండేది ఒకప్పుడు. ఇప్పుడు లేదని కాదుగానీ, గతంలో వున్న గౌరవం 'నంది'కి ఇప్పుడు లేదన్నది నిర్వివాదాంశం. కారణం, 'నందుల్ని కొనేసుకోవచ్చు..' అన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో బలపడిపోవడమే. అంతలా, రాజకీయం 'నంది'పై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది మరి. 'తెలుగు ఆస్కార్‌' అనీ 'నంది'కి ఒకప్పుడు పెద్ద పేరుండేది. కానీ, ఇప్పుడు 'నంది' అంటే, 'ఓసోస్‌' అనేస్తున్నారు చాలామంది. 

ఇక, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయిన దరిమిలా 'నంది' అటకెక్కేసింది. 2012 సంవత్సరానికి సంబంధించి నంది అవార్డులు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అప్పటికి రాష్ట్రం విడిపోలేదనుకోండి.. అది వేరే విషయం. 2013 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డులూ అంతే. ఆ రెండిటినీ, ఇప్పుడు ఇవ్బబోతున్నారట. దీనికోసం కమిటీల్ని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ముందే చెప్పుకున్నాం కదా, 'నంది' చుట్టూ రాజకీయం ఓ రేంజ్‌లో రాజ్యమేలుతుందని. ఇప్పుడూ అంతే. ఓ కమిటీకి జయసుధ నేతృత్వం వహిస్తారు. ఆమె టీడీపీలో ఇటీవల చేరిన విషయం విదితమే. అంటే, 'రాజకీయ నిరుద్యోగి' కోటాలో 'సహజ నటి' జయసుధకి ఆ పదవి వచ్చిందనుకోవాలా.? టీవీ నందుల కమిటీకి కవితను ఛైర్మన్‌ని చేశారు. ఆమె కూడా టీడీపీ నేత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! కవిత సీనియర్‌ నటి. జయసుధ కూడా అంతే. కానీ, ఇప్పుడు రాజకీయ విమర్శలు వస్తున్నాయంటే, దానిక్కారణం.. రాజకీయ కోణంలో నియామకాలు జరగడమే. 

నంది అవార్డుల కమిటీ ఛైర్మన్ల ఎంపికే ఇంత రాజకీయం అయితే, ఇక అవార్డుల చుట్టూ ఇంకెంత రాజకీయం నడుస్తుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అన్నట్టు, తెలంగాణ ప్రభుత్వం 'నంది' స్థానంలోకి సింహ తెచ్చింది. ఆ అవార్డులెప్పుడొచ్చేనో ఏమో మరి.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?