బన్నీ-సుకుమార్ తో భారీ ప్రాజెక్టు సెట్ మీదకు వచ్చింది. మహేష్-పరుశురామ్ కాంబినేషన్ సినిమా చర్చల్లో వుంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా తమదే అన్న ధీమా వుంది. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా అనుకోని అవాంతరాలు వస్తే తప్ప, పక్కాగా లైన్ లో వుంది.
ఇలాంటి నేపథ్యంలో మరో భారీ సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు మైత్రీ మూవీ మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. ప్రస్తుతానికి కొరటాల శివ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత అవకాశం వుంటే లూసిఫర్ రీమేక్ చేయాలని వుంది. దానికి ఎన్వీ ప్రసాద్ నిర్మాత. దాని తరువాత ప్రాజెక్టు ఏదీ పైప్ లైన్ లో లేదు. దాన్ని ఎవరితో చేద్దామా? అనే ఆలోచనలో మెగాస్టార్ వున్నారు.
ఈ ఆలోచన ఆయనలో వుంది అని తెలియగానే, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు మెగాస్టార్ సెట్ లో వాలిపోయినట్లు బోగట్టా. మెగాస్టార్ వేరే వాళ్లతో చేయాలనే ఆలోచనను, వీళ్లు బైపాస్ చేయించే ప్రయత్నంలో వున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది. మెగాస్టార్ మదిలో ఏ డైరక్టర్ వున్నారో పసిగట్టి, ఆ డైరక్టర్ ను ట్యాప్ చేసే పనిలో కూడా బిజీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. కానీ ఇన్ని భారీ సినిమాలు చేతిలో వున్న మైత్రీ కంటే వేరే వాళ్లకే చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ వున్నారని తెలుస్తోంది.