నేనే బుగ్గన స్థానంలో ఉండి ఉంటే సన్యాసం తీసుకునేవాణ్ని. అసలే ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. పాత ముఖ్యమంత్రి చేసిన అప్పులపై వడ్డీలు కట్టడానికే గుడ్లు తేలేయాల్సి వస్తోంది. రాష్ట్ర జిడిపి ఎంత అని ఎవరైనా అడిగితే మొహం చాటేయాల్సి వస్తోంది. ఇటు ముఖ్యమంత్రిని చూస్తే రోజుకో స్కీము ప్రకటించేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పినవీ, చెప్పనవీ అన్నీ టపటపా ప్రకటించేస్తున్నాడు. రేపనే రోజు ఉంటుందో లేదో తెలియనంత ఆతృతగా, ఆబగా అమలు చేసేస్తూ దానకర్ణుడికే కంగారు పుట్టిస్తూ చరిత్రలోకి ఎక్కాలన్న తాపత్రయం కనబరుస్తున్నాడు. ఇవేళ రాత్రి ముఖ్యమంత్రి గారి కలలో ఏ ఐడియా దూరకుండా చూడు వెంకటరమణా అని ఆర్థికమంత్రి పడుక్కోబోయే ముందు ప్రార్థించే పరిస్థితి వచ్చింది.
అన్నీ ఒకేసారి చేయాలా? – నాయకులు వాగ్దానాలు చేస్తారు. వాటిల్లో సగం నెరవేర్చినా జనాలు మహదానంద పడతారు. అవి కూడా అధికారంలోకి వచ్చిన ఏ మూడో ఏడో మొదలుపెట్టి, నాలుగో ఏడులో కాస్త గట్టిగా చేసినా తృప్తి పడతారు. మొన్న దిల్లీలో అరవింద్ పదవీకాలం పూర్తయ్యేందుకు ఆర్నెల్ల ముందే కొన్ని పథకాలు పెట్టినా, జనాలు ఫిర్యాదు చేయకుండా 90% సీట్లు కట్టబెట్టారు. మరి అలాటిది జగన్ అన్నీ మొదటి ఏడాదిలోనే ఎందుకు చేయాలి? మాట తప్పని- మడమ తిప్పని… సిండ్రోమా? ఏడాదికి కొన్ని చొప్పున చేస్తూ పోతే ఆ బిరుదు ఎవరైనా ఎత్తుకుపోతారా? ‘అధికారంలోకి రాగానే నా మొదటి సంతకం ఫలానా ఫైలు మీదే’ అని చాలామంది నాయకులు ప్రకటిస్తారు. కొందరు చేస్తారు కూడా. అయితే తర్వాత కొన్నాళ్లకు దాని విధివిధానాలు బయటకు వస్తాయి – ఫలానాది వుంటే యిది వర్తించదు, ఇంతే యిస్తాం, యింతమందికే యిస్తాం అంటూ భారం తగ్గించుకుంటూ వస్తారు. జనాలు తిరగబడరు. సరేలే అనుకుంటారు.
ఏ పథకమైనా పేపరు మీద బాగానే ఉంటుంది. ఆర్థికవేత్తలు, ప్రణాళికా శూరులు ఏవేవో లెక్కలు వేసి చేసేయచ్చు అంటారు. అమలు చేసేటప్పుడే కష్టం తెలుస్తుంది. వ్యవస్థలో అడుగడుగునా లోపాలుంటాయి. దొంగ లబ్ధిదారులు దూరేస్తారు. తడిసి మోపెడవుతుంది. అప్పుడు దానిలో మార్పు చేయాల్సి వస్తుంది. కొన్ని రైడర్స్ పెట్టాల్సి వుంటుంది. అందుకే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలలో ప్రవేశపెట్టి, లోపాలు సవరించుకుని, తక్కిన జిల్లాలకు విస్తరించాలి. ఫలితాలు బాగా వస్తున్నాయంటే తక్కిన వర్గాలకు విస్తరించాలి. అలాగే ఓ నాలుగు పథకాలు ముందుగా పెట్టి అవి విజయవంతమైతే, నిలదొక్కుకుంటే, వచ్చే ఏడాది రాష్ట్రఆదాయం పెరిగితే మరో నాలుగు పథకాలు పెట్టవచ్చు. అదేమీ కాకుండా ‘ఇక్కడ ప్రజాధనం దోచిపెట్టబడును’ అని బోర్డు పెట్టుకుని అన్నీ ఒకేసారి, పప్పుబెల్లాల్లాగా పంచేస్తూ ఉంటే ఎలా? ఈ పథకాలను యిదే రీతిలో ఐదేళ్ల పాటు నిర్వహించగలరా? ఏడాదేడాదికి లబ్ధిదారులు పెరిగితే తట్టుకోగలరా?
ఖర్చు చూస్తే బోల్డు – మధ్యతరగతి జీవులం మనకు తెలుసు. ఈ నెలలో బట్టలు కొంటే, వచ్చే నెలలో కుట్టించుకుంటాం. రెండూ ఒకే నెలలో భరించడం కష్టం. మధ్యలో ఏ అనారోగ్యమో వచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే కుట్టించుకోవడం వాయిదా పడుతుంది. మనకు బోల్డు పండుగలు సంకురాత్రికి కాకపోతే శివరాత్రికి కొత్త బట్టలు వేసుకుంటాం. మనం మధ్యతరగతి అయితే ఆంధ్రప్రభుత్వంది దిగువ మధ్యతరగతి. రాబోయే ఖర్చు చూస్తే మనకే దిగులు వేస్తుంది. ఖర్మం చాలక మధ్యలో హుదూద్ లాటి విపత్తు వస్తే వీళ్ల లెక్కలన్నీ ఏమవుతాయో అని భయమేస్తుంది. ప్రకృతి విపత్తు మాట సరే, సొంతంగా తెచ్చిపెట్టుకున్న విపత్తు ఒకటి వుంది. రాజధాని మార్పు! ఎంత సంసారపక్షందైనా కొత్త రాజధాని కట్టాలిగా. దానికి కనీసం 5 వేల కోట్లయినా కావలసి వస్తాయి కదా! అది భవనాలకు, రోడ్లకు అనుకుంటే ఆ పైన ఉద్యోగుల హిరణ్యాక్షవరాలు తీర్చాలి.
అమరావతిలో ఏదైనా ఉంచినా, ఉంచకపోయినా రైతులిచ్చిన భూములను డెవలప్ చేసి యివ్వక తప్పదు కదా! లేకపోతే కోర్టు ఊరుకోదు. డానికే లక్ష కోట్లవుతుంది. అదీ పాత ప్రభుత్వం రెండేళ్ల క్రితం వేసిన లెక్క. ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరుగుతుంది. పైగా కోర్టు నష్టపరిహారం కూడా యిమ్మనవచ్చు. ఇంతేనా? పోలవరం ఒకటి 2021 కల్లా పూర్తి చేసేస్తామంటున్నారు. దానికి డబ్బు కావాలి. ఇప్పటిదాకా పాత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా తొక్కిపట్టారు. మాకు నమ్మకం లేదు, వెరిఫై చేయాలంటూ కాలక్షేపం చేశారు. ఎంతకాలం చేయగలుగుతారు? ఎప్పటికో అప్పటికి చెల్లించాలి కదా. లేకపోతే కోర్టు జరిమానా విధించవచ్చు. అన్నట్టు యింకో విషయం మర్చిపోయాను. దేశంలో ఎక్కడా లేని విధంగా యీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు డజన్లకు మించి సలహాదారులున్నారు. వారి జీతభత్యాలకే బోల్డు అవుతుంది.
మరోటండోయ్, స్మశానాలతో సహా ప్రభుత్వ ఆస్తులన్నిటిపై వైసిపి పార్టీ రంగులేయడానికే వేలాది కోట్లు ఖర్చవుతున్నాయి. వాటికీ డబ్బు కావాలి. కోర్టు వాళ్లు అభ్యంతర పెడితే ఎన్నికల వేళ వాటిని గోకేయడానికో, ముసుగేయడానికో యింకా ఖర్చు పెట్టాలి. ముఖ్యమంత్రిగారు దావోస్, లావోస్ అంటూ విదేశాలు తిరగటం లేదు, రైతులను సింగపూరుకు తిప్పటం లేదు కాబట్టి కానీ ఆ ఖర్చూ చేరేది. కేంద్రం చూస్తే ఎంగిలి చేయి కూడా విదల్చడం లేదు. ఎన్‌డిఏలో చేరతాం అని ఊరించినా, చేరితే చేరండి కానీ డబ్బు మాత్రం అడక్కండి అంటారు వాళ్లు. టిడిపికి మంత్రిపదవులు యిచ్చాం కానీ, రాష్ట్రానికి నిధులిచ్చామా? ఇప్పుడు మీకిస్తే వాళ్లు నొచ్చుకోరా? అంటారు.
తొమ్మిది అంకె దాటిపోయింది స్వామీ! – ఇలాటి పరిస్థితుల్లో కూడా జగన్ పొద్దున్న లేస్తే నవరత్నాలంటారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన రత్నాలేమిటి? వైయస్సార్ రైతు భరోసా, ఫీజు రీఎంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దశలవారీ మద్యనిషేధం, జగనన్న అమ్మ ఒడి, మహిళలకు వైయస్ ఆసరా, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు వైయస్సార్ చేయూత, పేదలకు ఇళ్లు, వైయస్సార్ పెన్షన్ కానుక. వీటికి చేర్చిన కొత్త పథకాలు – ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులను మెరుగుపరిచే నాడు-నేడు, జాలర్ల కోసం వైయస్సార్ మత్స్యకార నేస్తం, ఆరోగ్యశ్రీకి కొనసాగింపుగా వైయస్సార్ ఆరోగ్య ఆసరా, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ వాహనమిత్ర, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ లా నేస్తం. ఇవి కాక యింకా ఏవో ఉన్నాయేమో, గుర్తు రావటం లేదు. నాకే కాదు, మంత్రులకు కూడా గుర్తు రావేమో, అన్ని పెట్టేశారు.
వీటి ద్వారా కోటిన్నర కుటుంబాలకు 23,767 కోట్ల రూ.లు పంపిణీ అవుతుందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కోటిన్నర కుటుంబాలంటే, కుటుంబానికి నలుగురు సభ్యులున్నారనుకుంటే ఆరు కోట్ల మంది లబ్ధిదారులున్నారన్నమాట. రాష్ట్ర జనాభా చూడబోతే 5.40 కోట్లు! అంటే కొంతమందికి రెండేసి పథకాలు దక్కుతున్నాయన్నమాట. ఇవి కాక ఎప్పణ్నుంచో వస్తున్న పథకాలు కొన్ని వుంటాయి కదా! ‘మన బియ్యం’ పేర రూపాయికి కిలో బియ్యం చొప్పున కుటుంబానికి 20 కిలోల బియ్యం, ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేర నెలకు రూ.2 వేల చొప్పున 4.30 లక్షల మందికి నిరుద్యోగ భృతి వంటివి! అవి మానేయడం కష్టం. పేర్లు మార్చగలుగుతారు కానీ మొత్తం ఎత్తేయలేరు కదా! 13 జిల్లాల, 25 ఎంపీల, రాజధాని సైతం కట్టుకోలేని, పరిశ్రమలు లేని చిన్న రాష్ట్రానికి ఇంత భారం అవసరమా? ఎవరడిగారని?
తాయిలాలతో పైకి వచ్చిన ప్రాంతీయపార్టీలు – స్వాతంత్య్రం వచ్చినపుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అనేకం చేపట్టింది. ఆనకట్టలు, డ్యామ్‌లు, కాలువలు, భారీ పరిశ్రమలు, కొత్త నౌకాశ్రయాలు, కొత్త విమానాశ్రయాలు, గనులు, రోడ్లు, ఆసుపత్రులు, బడులు, కాలేజీలు, మంచినీటి ఏర్పాట్లు, డ్రైనేజి సౌకర్యం, విద్యుత్ ప్రాజెక్టు, మిలటరీకి ఆయుధాలు, హరిత విప్లవం పేర కొత్త వరివంగడాలు, శ్వేత విప్లవం పేర పాల ఉత్పత్తి పెంచడం, కొత్త రైల్వే లైనులు, కొత్త టెలిఫోను వైర్లు, .. యిలా సవాలక్ష పనులు మొదలుపెట్టారు. ప్రతి రాష్ట్రమూ మాకు ముందంటే మాకు ముందన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా మాకే కావాలంటే మాకన్నారు. అందుకని అనేక చోట్ల శంకుస్థాపనలు చేసేసి, పనులు మొదలుపెట్టారు. అయితే ఉన్న నిధులు తక్కువ. ప్రజలకే ఆదాయం తక్కువ, వారి నుంచి పన్నుల ద్వారా ఇంకేం వస్తుంది? పైగా మద్యనిషేధం, కుటుంబనియంత్రణ, టీకాలు వంటి సామూహిక సంక్షేమపథకాలకు కూడా వెచ్చించాలి. వీటివలన వచ్చే డబ్బును తలా కాస్తా పంచడం మొదలుపెట్టారు.
దీనివలన నిర్మాణవ్యయం పెరుగుతూ పోయింది. రెండోది వీటి ఫలితాలు రావడంలో ఆలస్యం కావడంతో జనాల్లో అసహనం కలగసాగింది. మా గ్రామానికి విద్యుత్ యిచ్చారంటే, మా వూళ్లో బడి పెట్టారంటే నాకు వ్యక్తిగతంగా ఏం లాభం? నా జేబులోకి ఏమైనా వస్తోందా? అని ఆలోచించే జనాలు పెరిగారు. దీన్ని పసిగట్టింది, తమిళనాట వెలసిన ప్రాంతీయ పార్టీ డిఎంకె. 1967 ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే రూపాయికి మూడు పడులు (పడి అంటే రమారమి సోల) బియ్యం యిస్తాం అనే నినాదం అందుకుంది. ఉన్న కాస్త డబ్బు యిలాటివాటికి యిచ్చేస్తే చేపట్టిన ప్రాజెక్టుల గతేమిటి? అలా యివ్వకూడదు అని కాంగ్రెసు వాదించింది. జనాలకు కాంగ్రెసు వాదన నచ్చలేదు. డిఎంకె హామీయే నచ్చింది. వాళ్లని గెలిపించారు. గెలిచాక డిఎంకె రూపాయికి పడి బియ్యమే యిచ్చింది. జనాలు సరేలే అనుకున్నారు. అది చూసి కాంగ్రెసు మేమూ యిస్తాం అనలేక పోయింది. ఎందుకంటే యిక్కడ యిస్తే పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెసు యూనిట్‌పై ఒత్తిడి పడుతుంది.
భారం మీకు, పేరు మాకు – ఇదే జాతీయ పార్టీ కున్న కష్టం. దేశమంతటికీ ఒకే విధానం అమలు చేయాలి. ప్రాంతీయ పార్టీకి ఆ బాధ్యత లేదు. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల బట్టి, ఓటు బ్యాంకు బట్టి, తమకు అనువైన తాయిలాలను చూపి ఓటర్లను ఊరించవచ్చు. ఇక ప్రాంతీయపార్టీలన్నీ తాయిలాల పార్టీలుగా మారి, జాతీయ పార్టీలకు పోటీ యివ్వసాగాయి. జాతీయ పార్టీలు ఓడిపోయి, కేంద్రంలో కూడా ప్రాంతీయ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీర్ఘకాలిక ప్రాజెక్టులకు సెలవిచ్చేసి, ఋణమాఫీలనీ, పంటకు మద్దతు ధరలనీ యిలా తాత్కాలికాల మీద పడ్డారు. చివరకు ఎలా తేలిందంటే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ‘సంక్షేమ పథకాలతో మేం జనాల్ని ఆకట్టుకుని ఓట్లేయించుకుంటాం, దీర్ఘకాలిక ప్రాజెక్టులు కూడా అవసరమే కానీ ఆ భారం మీదే’ అని కేంద్రాన్ని పాలిస్తున్న జాతీయ పార్టీలకు చెప్పసాగాయి.
ఇలా అయితే తమకు ఎన్నటికీ పేరు రాదని భయపడిన జాతీయ పార్టీలు తాము కూడా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్రాలను అమలు చేయమన్నాయి. అయితే యీ ప్రాంతీయ పార్టీలు ఆ పేర్లకు బదులు తమ పేర్లు పెట్టేసి, అవి తాము పెట్టిన పథకాలే అనే యింప్రెషన్ కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీ రాష్ట్ర యూనిట్లు ‘ఇది అన్యాయం, అది మా డబ్బు, మీదని ఎలా చెప్పుకుంటారు?’ అని గగ్గోలు పెట్టసాగాయి. ‘మీకేమైనా డబ్బు చెట్లకు కాస్తున్నాయా? మేం పంపించిన డబ్బేగా మాకు తిరిగి యిస్తున్నది?’ అని ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు అనసాగాయి. మరి ఆ డబ్బులో జాతీయ అవసరాలైన పథకాలకు ఖర్చు పెడుతున్నాంగా, విడిగా మీకు యిన్ఫ్రాస్ట్రక్చర్కు డబ్బు కావాలంటున్నారుగా, విపత్తులొస్తే మా దగ్గరే డిమాండ్ చేస్తున్నారుగా, అవన్నీ పోగా మేం కొంత సంక్షేమానికి యిస్తే వాటికి మీ పేర్లు పెట్టడమే కాక, యింకా పైన మీ పథకాలు పెట్టి, ‘బజెట్ లోటు ఏర్పడింది, భర్తీ చేయండం’టే మేమెందుకు యిస్తాం?’ అంటున్నాయి కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలు.
తాయిలాలకు ఓట్లు రాల్తాయా? – చివరకు తేలిందేమిటంటే ఓట్లు రాలాలంటే సంక్షేమ పథకాలను గుప్పించడమే, రేపటి సంగతి, ఎల్లుండి సంగతి దేవుడు చూసుకుంటాడు అనే ధోరణిలో ప్రాంతీయ పార్టీలు పడ్డాయి. కానీ తమాషా ఏమిటంటే తాయిలాలు యిచ్చిన పార్టీలన్నీ ఎన్నికలలో గెలవటం లేదు. రెండు ప్రాంతీయ పార్టీలున్న చోట, పోటీపడి ఒకర్ని మించి మరొకరు హామీలు గుప్పించినా, తక్కువ పథకాలు యిస్తానన్న వారిని గెలిపించిన సందర్భాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీకి కెసియార్ మళ్లీ గెలిస్తే పథకాలు గెలిపించాయన్నారు, ఇప్పుడు దిల్లీలో అరవింద్ గెలిచినా అదే మాట అన్నారు. కానీ ఆంధ్రలో బాబు విషయంలో అది జరగలేదు. రేపు జగన్ విషయంలో జరుగుతుందో లేదో స్థానిక ఎన్నిక ఫలితాలు సూచిస్తాయి.
తెలుగునాట సంక్షేమ పథకాలనగానే ఎన్టీయారే గుర్తుకు వస్తారు. ‘దీర్ఘకాలిక పథకాలు ఫలితాలను యిచ్చేదాకా యీ సామాన్యుడు బతికి ఉండాలిగా అంటూ 2 రూ.లకు కిలో బియ్యం, ఉచిత వస్త్రాలు వగైరా మొదలుపెట్టారు. అవి విజయవంతం కావడంతో తెలుగునాట వీటి జోరు పెరుగుతూ పోయింది. మార్కెట్లో రూ.3.50 ధర ఉన్నపుడు బియ్యం రూ.2కు యిచ్చారు. ఇప్పుడు రూ.60 ఉన్నపుడు రూపాయికి యిస్తాననడమేమిటి? ధైర్యం చేసి ఏ పాతిక రూపాయలో చేయవచ్చు కదా అంటే యిది పులి స్వారీ లాటిది. ఎక్కడమే తప్ప దిగగలిగే ప్రశ్న లేదు. పథకం తీసేస్తే జనాలకు కోపాలు వస్తాయని భయం. ఇప్పుడు బోగస్ తెల్లకార్డు, రేషన్ కార్డు ఏరేస్తూంటే ప్రతిపక్షం వాళ్లే కాదు, స్వపక్షం వాళ్లూ గోల, ఓట్లు పోతాయని! నిజానికి అవి పేదలకు ఉద్దేశించిన పథకాలు. డబ్బున్నవాళ్లూ తీసేసుకుంటే అందాల్సిన వాళ్లకు అందవు కదా!
కలుపు ఏరడానికి ధైర్యం ఉండాలి – ఆంధ్రజ్యోతి ఓ కథనంలో ‘తెల్ల కార్డున్న వాళ్లు స్థలాలు కొనకూడదంటే ఎలా? ఆ మాట కొస్తే రాష్ట్రంలో 95% మందికి ఆ కార్డులున్నాయి.’ అని రాసింది. ఆ అంకె నిజమే అయితే అంతకంటె సిగ్గుచేటైనది మరోటి ఉండదు. రాష్ట్రంలో 5% మంది మాత్రమే ధనికులుంటే యిన్ని నగల షాపు, బట్టల షాపులు ఎలా ఉంటాయి? బోగస్ పేదలను ఏరివేస్తే మిగిలే డబ్బుతో సంక్షేమ పథకాలు కొన్నిటికి నిధులు సమకూరుతాయి. ఓట్ల భయం లేకుండా అది చేసినవాడే మొనగాడు. రాజీపడితే సగటు నాయకుడే! కొన్ని దండగమారి పథకాలుంటాయి. వాటిని ఎత్తివేయడానికీ ధైర్యం ఉండాలి. అన్న క్యాంటీన్ పేదల కొరకు ఉద్దేశించినది. కానీ చాలా మంది గృహస్తులు అవి వచ్చాక యిళ్లల్లో వంటలు మానేసి, అక్కడకు వెళ్లి తినేసి, అలా మిగిలిన డబ్బు సినిమాకు, షికార్లకు ఖర్చు పెట్టారని విన్నాను. అవి ఎత్తేస్తే ఆందోళన రాకపోవడానికి అదో కారణమేమో!
ముఖ్యంగా మనం తెలుసుకోవసినది – సంక్షేమ పథకాలకు, దీర్ఘకాలిక పథకాలకు తూకం ఉండాలి. ఏది ఎక్కువైనా ప్రజలను సంతుష్టి పరచడం కష్టమే. పెళ్లిళ్లకు, పేరంటాలకు, పండగలకు, తీర్థయాత్రలకు ప్రభుత్వం యివ్వనక్కరలేదు. ఇవ్వకపోయినా జరిగేవి జరుగుతాయి, యివ్వడం వలన వాళ్ల అట్టహాసం పెరుగుతుందంతే! కూడూ, గూడూ, గుడ్డ, విద్య, వైద్యం వీటిపై దృష్టి పెడితే చాలు. ఇవి కూడా వ్యక్తిగతంగా యివ్వవలసిన పని లేదు. వాటి ధరలు ప్రజలకు అందుబాటులో పెడితే చాలు. ఉచితంగా ఆశించకుండా సబ్సిడీలో కొనుక్కోవడం అలవాటు చేయాలి వారికి. విద్య, వైద్యం చాలా ఖరీదైన వ్యవహారాలు అయ్యాయి. ఆరోగ్యశ్రీతో కార్పోరేట్ ఆసుపత్రులను పరిపుష్టం చేసేబదులు ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలి. మందులు చౌకధరలో దొరికే ఏర్పాటు చేయాలి. కార్పోరేట్ కాలేజీలు ఫీజుల పేరుతో చేసే దోపిడీ ఆపి, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మేలైన విద్య అందేట్లు చూసి, సామాన్యులను అక్కడకు ఆకర్షించాలి. అరవింద్ కేజ్రీవాల్ స్కోర్ చేసినది అక్కడే – అందుబాటులో విద్య, వైద్యం! తాగునీరు, విద్యుత్ ధరలు తగ్గించడం బోనస్ అయింది.
వివక్షత చూపకపోవడం మెప్పించింది – పథకాల్లో మరో కోణమేమిటంటే కాస్ట్ ఆఫ్ డెలివరీ మెకానిజం, డబ్బు పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ నిర్వహణ ఖర్చు! అదృష్టవశాత్తూ పాత పాలకుల ముందుచూపు వలన కంప్యూటరైజేషన్, ఆధార్ వంటి వ్యవస్థలు ఏర్పడి డబ్బు వారికి నేరుగా చేరే సౌకర్యం ఏర్పడింది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం, వాటిని వెరిఫై చేయగలగడం జరుగుతోంది. డబ్బు నేరుగా పేదలకు చేరినప్పుడు వాటిని ఖర్చు పెట్టడం ద్వారా, వస్తూత్పత్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. డిజిటలైజేషన్లో మరో సౌకర్యం ఏమిటంటే లబ్ధిదారుడు ఏ పార్టీ వాడు, మనవాడా? పరాయివాడా? వంటివి తెలుసుకునే వీలుండదు. వాణ్ని ఎలిమనేట్ చేయలేరు.
బాబుకి అప్రతిష్ఠ తెచ్చిపెట్టినవి జన్మభూమి కమిటీలు. జగన్ హయాంలో ఆ భయం లేకుండా అన్ని పార్టీల వారికీ అందడంతో ఆ దిశగా ఫిర్యాదు వినబడటం లేదు. ఉన్న ఫిర్యాదులన్నీ కార్డులు రద్దు చేస్తున్నారనే! అదీ మా పార్టీ వాళ్లవి అనటం లేదు. అంటే మీ పార్టీ వాళ్లు యిన్నాళ్లూ అన్యాయంగా లబ్ధి పొందారన్నమాట అంటారు. ఆధార్‌తో అనుసంధానించినప్పుడు వాడి ప్యాన్ నెంబరెంతో, వాడికి ఏ వాహనముందో, ఎంత ఆస్తి ఉందో, తెల్ల కార్డుకి, యీ సంక్షేమ పథకానికి అర్హుడో కాదో చటుక్కున తెలిసిపోతుంది. తెలిసినా అనర్హులను తొలగించలేదంటే పొలిటికల్ విల్, ధైర్యం, నిజాయితీ లేవని అర్థం.
మందుబాబుపై చంద్రబాబు సహానుభూతి – సంక్షేమ పథకాలు క్యారట్లయితే, ప్రజలకు స్టిక్ కూడా చూపించాలి. బియ్యం మీద, చదువు మీద ఆదా చేసిన డబ్బును సారా మీద తగలేస్తానంటే ఆ వీలు లేకుండా చేయాలి. తరచి చూడండి, జరిగే నేరాల్లో 80-90% కేసుల్లో మద్యం పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఉంటోంది. ఆడపిల్ల మీద అత్యాచారాల విషయంలోనే కాదు, అక్రమ సంబంధాల విషయంలో కూడా ప్రియుడు, మొగుణ్ని తాగుదాం రా అని తుప్పల్లోకి తీసుకెళ్లి తాగించి, నెత్తిమీద బాటిల్‌తో మోదుతున్నాడు. గతంలో ఏదైనా విశేషం ఉంటేనే – ప్రమోషన్ వచ్చిందనో, స్కూటర్ కొన్నామనో, పిల్లాడు పుట్టాడనో- మిత్రులు మందు పార్టీ అడిగేవారు. ఇప్పుడదేమీ లేదు, రొటీన్‌గా వారంలో సగటున ఐదు రోజులు తాగేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లు కూడా దుకాణం పెట్టేస్తున్నారు. మొగుడూ పెళ్లాలు యిద్దరూ తాగి కొట్టుకుంటూంటే పిల్లల గతి ఏమవుతుందో ఊహించుకోండి.
మద్యప్రవాహం ఎంత తగ్గిస్తే సమాజానికి అంత మంచిది. ఆంధ్ర ప్రభుత్వం మద్యం రేట్లను విపరీతంగా పెంచేసి, మందుబాబులను యిబ్బంది పెట్టేస్తోందని చంద్రబాబు ఊహూ విలవిల్లాడి పోతున్నారు. ప్రజల క్షేమం కోరే నాయకుడు అలా పబ్లిగ్గా మాట్లాడవచ్చా? ఆయనకు సంబంధించిన డిస్టిలరీ కంపెనీలను నియంత్రించి, జగన్ తన కంపెనీలను ప్రోత్సహిస్తున్నాడని అంటున్నారు. బాబు ఆవేదనకు అదే కారణమా? ప్రజారోగ్యానికి ఏది మంచిదో ప్రభుత్వం డబ్బు ఖర్చుపెట్టి మరీ చెప్పాల్సి వస్తోంది. హెల్మెట్ పెట్టుకో, కారు సీటు బ్టొ పెట్టుకో, పొగాకు నమలకు, సిగరెట్టు పీల్చకు, మద్యం తాగకు… అంటూ. ప్రతి బజెట్‌లో సిగరెట్ల రేటు పెంచేసి, వాడకం తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు జగన్ మద్యం షాపుల వేళలు తగ్గించి, ధరలు ఆకాశానికి పెంచేయడం వలన డబ్బు చాలక జనాలు తక్కువ తాగినా కుటుంబానికి లాభమే తప్ప నష్టం లేదు. దానివలన ప్రభుత్వాదాయం తగ్గినా జగన్ ఖాతరు చేయడం లేదు. మంచిదే.
ప్రభుత్వ భూములకు గిరాకీ వుందా? – ఇది బాగానే ఉంది కానీ అసలు సమస్య జగన్ తన పథకాలకు డబ్బు ఎలా తెస్తాడన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఆదాయం ఎక్కణ్నుంచి? గత ఐదేళ్లగా బాబు ఏం ఊదరగొట్టినా రాష్ట్రానికి పరిశ్రమలు యిప్పటిదాకా పెద్దగా రాలేదు, వద్దామనుకున్నవి జగన్ స్థానికులకు 75% ఉద్యోగాల రూలు విని జంకుతున్నాయి. ఉన్నవైనా పాత ఒప్పందాలు సమీక్షిస్తామంటే విస్తరించడానికి జంకుతున్నాయి. పోనీ, ఎప్పటికో అప్పటికి పరిశ్రమలు నెమ్మదిగా వస్తాయని అనుకున్నా వాటిపై ఆదాయం కళ్లచూసేసరికి కనీసం యింకో నాలుగైదేళ్లు పడుతుంది. రాష్ట్రానికి హైదరాబాదు వంటి కల్పవృక్ష సదృశ మహానగరం ఏమీ లేదు. చాలా కంపెనీల హెడాఫీసులు – సాక్షితో సహా- హైదరాబాదు నుంచి కదలలేదు, అందువలన పన్ను అక్కడికే పోతుంది.
దేశమే డబ్బు లేక అల్లాడుతోంది. కేంద్రం రాష్ట్రాలకు జిఎస్టి బాకీలు చెల్లించటం లేదు. ఇక యీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమిస్తుంది? అప్పు చేద్దామన్నా బాబు ఉన్న పరపతి అంతా కరారావుడు చేసేశారు, క్రెడిట్ లిమిటు దాటేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల వంటి వాటితో రాజకీయ లబ్ధి పొందవచ్చు తప్ప ఖజానాకు ఆదాయం రాదు. వైయస్ గతంలో హైదరాబాదులో ప్రభుత్వ భూములమ్మి ఖజానాకు డబ్బు చేర్చారు. జగన్ అలాటి ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. అప్పట్లో హైదరాబాదుకి ఉన్న బ్రాండ్ యిమేజి వేరు. ఆ మార్కెట్ వేరు. ఆంధ్రలో ఏ ఊరికి ఆ రేటు పలుకుతుంది? అభివృద్ధి చేస్తాం అని చెప్పుకోవడమే తప్ప యిదిగో చేశాం, చూడండి అని చూపించడానికి ఏమీ లేదు. బాబు గ్రాఫిక్స్ అమరావతి ప్రయోగం తర్వాత ఏదైనా చేస్తామని ఏ ప్రభుత్వం అన్నా, నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
పైగా ఆంధ్రలో నిర్మాణాత్మకంగా చెప్పుకోదగ్గ పని యిప్పటిదాకా జరగలేదు. జగన్ ఎంతసేపూ సంక్షేమ పథకాలూ, రాజధాని మార్పు, అధికార వికేంద్రీకరణ లాటివి మాట్లాడుతున్నారు తప్ప ఫలానా సెజ్ ఏర్పాటు చేశాం, ఫలానా ప్రణాళిక రూపొందించాం అని చూపటం లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లాటివి చెప్పినా ఫలితాలు ఫలదీకరించలేదు. అందువలన ప్రస్తుతానికి ఆంధ్రలో భూముల విలువ పెద్దగా వుంటుందని, వాటిని అమ్మి ప్రభుత్వం డబ్బు చేసుకోగలుగుతుందని అనుకోవడానికి లేదు. డబ్బు లేకుండా యీ పథకాలు ఎంతకాలం సాగుతాయో ఎవరూ ఊహించుకోలేరు. ఆపి వేస్తే మాత్రం ప్రజలు ఆగ్రహించడం ఖాయం. ‘ముందే చూసుకోవద్దా?’ అని మండిపడతారు. పరిస్థితి చూస్తూ ఉంటే చివరకు జనాలే మాకు కొత్త స్కీములొద్దు మొర్రో, నెలవారీ జీతాలిస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కాస్త ఖర్చు పెట్టండి మహాప్రభో అని బతిమాలే రోజు వస్తుందనిపిస్తోంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)