సినిమాతో భరోసానా.. ఇదేంది చిరూ సార్!

అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణ సినిమా హీరోగా కనిపించి బీభత్సమైన కామెడీ చేస్తాడు. ‘నా లాస్ట్ సినిమాలో ఒంటి చేత్తో ఇరవై మందిని ఇరక్కొట్టా..’ అంటూ వాస్తవంలోని సంఘటనకు, సినిమాకూ పోలిక పెట్టి మాట్లాడతాడు.…

అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణ సినిమా హీరోగా కనిపించి బీభత్సమైన కామెడీ చేస్తాడు. ‘నా లాస్ట్ సినిమాలో ఒంటి చేత్తో ఇరవై మందిని ఇరక్కొట్టా..’ అంటూ వాస్తవంలోని సంఘటనకు, సినిమాకూ పోలిక పెట్టి మాట్లాడతాడు. కాస్త అటు ఇటుగా చిరంజీవి మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. తన 150 వ సినిమా రైతుకు భరోసా.. అనేది మెగాస్టార్ ఉవాచ!

భలే ఉంది కదా, సినిమాలో రైతులను ఉద్ధరించేయడం అనమాట! ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి రైతులంతా ‘ఖైదీ-150’ అనే సినిమాను చూసి తమ బతుకులకు భరోసా పొందాలి! ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, పాలకులకు భూమిని మింగేసంత ఆకలి.. అభివృద్ధి పేరుతో రైతులు మీదకు పడుతున్నారు.. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ‘ఖైదీ -150’ లో ప్రభుత్వానికి, కార్పొరేట్ కంపెనీలకు బుద్ధి చెబుతాడు!

వాస్తవంలోని సమస్యకు పోరాటం, పరిష్కారం సినిమాలో.. కాకపోతే, రీ ఎంట్రీ హంగామా, వంద కోట్ల వ్యాపారం.. వీటితో మాత్రం రైతులకు సంబంధం లేదు. రైతులు తమ సమస్యల్లో ఊరట పొందాలంటే సినిమా చూడాలంతే! కామెడీ ఏమిటంటే… సినిమా తీస్తే తీసుకున్నారు.. సొమ్ములు చేసుకొంటే చేసుకున్నారు.. అది చాలక పొలిటికల్ మైలేజీ కూడా కావాలా!

రైతులను ఉద్ధరించడం అంటే సినిమాల్లో కాదు మెగాస్టార్.. మీరు బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్నారు. మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎంత ఉద్ధరించారు? ప్రతిపక్షంలో ఉండి ఎన్ని ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు? ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి! గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా.. సినిమాల్లో రైతుల కోసం పోరాడాను.. అంటే మాత్రం ‘దుబాయ్ శీను’ సినిమాలో కామెడీ సీన్లు గుర్తుకురాక మానవు!