మాయాబజార్ సినిమా గుర్తుందా? ఘటోత్కచుడి అసురపరివారంలో లంబు జంబులు ఉంటారు. అస్మదీయులు అనే హితుల గురించి పదాన్ని ఎలా పలికినా పర్లేదు గానీ.. వారు హితులని తెలుసుకుంటే చాలుననే భాష్యం చెప్పి ఒక్క వీరతాడు వేయించుకుంటాడు లంబు. శత్రువులను ఏం అనాలి అని రమణారెడ్డి అడగ్గానే.. తసమదీయులు అంటూ సెలవిస్తాడు జంబు. ‘వీడు కొత్త పదం సృష్టిస్తున్నాడు దేవరా’ అంటూ రమణారెడ్డి ఫిర్యాదు చేస్తే.. ‘ఎవడూ కొత్త పదాలు పుట్టించకుండా భాషెలా సంపన్నం అవుతుంది. వేయ్ వీడికి రెండు’ అని ధీరగంభీరంగా అంటూ జంబుకు రెండు వీరతాళ్లు వేయిస్తాడు ఘటోత్కచుడిగా ఉన్న ఎస్వీ రంగారావు. అలా భాషలో కొత్తపదాలు పుట్టిస్తూ లేదా వాటి వ్యాప్తికి ఉపకరిస్తూ ఉన్నందుకు నటుడు మోహన్‌బాబుకు కూడా రెండు వీరతాళ్లు వేయాల్సిందే.
ఆయన కూడా తెలుగు భాషా సంపదకు ఓ కొత్త పదాన్ని కంట్రిబ్యూట్ చేశారు. ఒకవేళ అది కొత్తది కాకపోతే దాన్ని విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మోహన్‌బాబు కుటుంబం విష్ణు కూతుళ్ల మయమైన ఆనంద ప్రపంచంలో ఓలలాడుతున్న విషయం అందరికీ తెలిసింది. విష్ణు కవల పుత్రికలు అరియానా విరియానా వారి జీవితంలో అందరి ఉల్లాసానికి హేతువులుగా ఉంటున్నారు.
అయితే వారు తనను తాతయ్యా అని పిలిస్తే మాత్రం మోహన్‌బాబు ఒప్పుకోరుట. తాతయ్య అంటే 80 ఏళ్లు దాటిన వారు మాత్రమేనట! అప్పటిదాకా తనను ‘నాన్నాన్న’ అని పిలవాల్సిందిగా మనవరాళ్లకు మోహన్‌బాబు నేర్పారుట. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలుగుభాషకు కొత్త పదాన్ని అందించినందుకు మోహన్‌బాబుకు కూడా రెండు వీరతాళ్లు వేయాల్సిందే కదా!!