నోట్ల మార్పిడి వ్యవహారాన్ని సినిమా వాళ్లలో కొందరు స్వాగతించారు. హ్యాట్సాఫ్ మోడీ, జై మోడీ.. అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్.. అదిరిపోయే నిర్ణయం.. అంటూ ట్విటర్ ద్వారా వీళ్లు తమ స్పందన వ్యక్తం చేశారు. వీరిలో సూపర్ స్టార్ రజనీకాంత్, మహేశ్ బాబుతో సహా అనేక మంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారు.
ఈ దేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తుంటే వాళ్లు దేశ భక్తులుగా చరిత్రకు ఎక్కుతున్నారీకాలంలో. దీంతో వీళ్లూ దేశ భక్తులే!
మరి ఇలా నోట్ల మార్పిడి వ్యవహారాన్ని సమర్థిస్తూ దేశభక్తులుగా ఎదుగుతున్న వాళ్లకు ఒకే ఒక సవాల్. వీళ్లు తమ ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా ఉంచగలరా? పారదర్శకంగా అంటే.. ఏ సినిమాకు ఎంత తీసుకుంటారు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు? అనే అంశాల గురించి వెబ్ లో ఇన్ఫర్మేషన్ పెట్టమనట్లేదు. ఈ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు ఈ సినిమా వాళ్లంతా సక్రమంగా వివరాలను తెలియజేయగలిగితే అదే చాలు.
మోడీకి హ్యాట్సాఫ్ చెబితే కాదు.. ప్రతి సినిమా విషయంలోనూ కోట్ల రూపాయలతో డీల్ చేస్తున్న సినిమా వాళ్లు ఆదాయపు పన్ను శాఖకు నిజాయితీతో సహకరిస్తే అప్పుడు వీళ్లు నిజమైన దేశ భక్తులు అవుతారు. ఆ మధ్య దక్షిణాది ఒక సూపర్ స్టార్ మిలటరీలో చేరాడు. పై స్థాయి ర్యాంకుతో మిలటరీ డ్రస్సులో పోజులు ఇచ్చాడు.
అయితే ఆ తర్వాత కొన్ని నెలలకు అతడి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు జరిగాయి. అక్రమాస్తుల గుర్తింపు జరిగింది! ఇక నోట్ల మార్పిడి వ్యవహారంలో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్లలో సినిమా వాళ్లు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
పదుల కోట్లలో పారితోషకం.. వందల కోట్ల లో వసూళ్లు.. కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు.. ఏతావాతా సినిమా వ్యవహారాల్లో బోలెడన్ని ఆర్థిక నేరాలు నమోదవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్న వాళ్లైనా తమ సినిమాల పారితోషకం విషయంలో ఆదాయపు పన్ను శాఖ వద్ద పారద్శకంగా వ్యవహరిస్తే అప్పుడు వీళ్లు సిసలైన హీరోలవుతారు.