''వాళ్ళు మగాళ్ళు కాదు.. వాళ్ళసలు మనుషులే కాదు.. మనుషుల రూపంలో వున్న మృగాలవి.. మృగాళ్ళు సిగ్గుపడే రోజు రావాలి.. అలా జరగాలంటే 'మీ టూ' అనే ఉద్యమం భారతదేశంలో ఉధృతమవ్వాల్సి వుంది..'' అంటూ ఒకప్పటి హీరోయిన్ తనూశ్రీ దత్తా ఒకింత ఆవేశంతో ఊగిపోయింది సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఘటనలపై మాట్లాడుతూ.
నానా పటేకర్ కారణంగా తాను లైంగిక వేధింపుల బాధితురాలిగా మారాననీ, ఆ ఘటనపై పెదవి విప్పితే తనకు మద్దతుగా సినీ పరిశ్రమలోని ప్రముఖులు చాలామంది నిలబడకపోవడం బాధ కలిగిస్తోందని తనూశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేసింది. 'ఓ ఆడదాని ఆవేదన ఇంకో ఆడదానికే తెలుస్తుంది. అందుకే, ప్రియాంకా చోప్రా లాంటి వాళ్ళు నాకు మద్దతు పలికారు. నా ఆవేదనను అర్థం చేసుకున్నారు.
దురదృష్టవశాత్తూ శక్తి కపూర్, అమితాబ్ బచ్చన్ లాంటివాళ్ళు నా పట్ల సానుభూతి ప్రకటించలేకపోతున్నారు.. ఇంకొందరు నన్ను తప్పు పడుతున్నారు.. కొందరైతే, ఈ ఘటనతో తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు.. వాళ్ళసలు సమాజంలో భాగమా.? కాదా.?' అని ప్రశ్నించింది తనూశ్రీ దత్తా.
'హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నది తనూశ్రీ దత్తా ఆరోపణ. పదేళ్ళ తర్వాత ఆమె ఈ ఆరోపణల్ని తాజాగా తెరపైకి తెచ్చింది. నిజానికి, అప్పట్లోనే నానా పటేకర్‌పై పోరాటం చేసిందిగానీ, ఆ పోరాటానికి ఎవరూ మద్దతు పలకలేదట. తనలా బాలీవుడ్లో ఎంతోమంది బాధపడుతున్నారనీ, వారందర్నీ ఒక్కతాటిపైకి తెస్తాననీ తనూశ్రీదత్తా చెబుతోంది.
కేవలం బాలీవుడ్ మాత్రమే కాదనీ, అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి వుందన్నది తనూశ్రీదత్తా వాదన. త్వరలో దేశవ్యాప్తంగా 'మీ టూ' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానంటున్న తనూశ్రీదత్తా, నానా పటేకర్‌పై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రకటించింది.
అయితే ఇప్పటికే నానా పటేకర్, తనూశ్రీ దత్తాకి లీగల్ నోటీసులు పంపిన దరిమిలా, ఆ నోటీసులపై ఆమె చట్టపరంగా ఎలా స్పందిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది.