పెద్ద తమిళ హీరోల తెలుగు మార్కెట్ ఎప్పడో పడిపోయింది. సినిమాలు వస్తున్నా కొనడానికి బయ్యర్లు ముందుకు రావడంలేదు. సరైన హిట్ లు రాకపోవడం, తెలుగునాట వసూళ్లు లేకపోవడం దీనికి కారణం. మణిరత్నం నవాబ్ సినిమా వస్తున్నా, ఏ పెద్ద బయ్యర్ ఆసక్తి కనబర్చలేదు. ఆఖరికి అశోక్ అనే కొత్త నిర్మాత ముందు అడుగువేసి కొనాల్సి వచ్చింది.
లేటెస్ట్ గా మురుగదాస్-విజయ్ ల సర్కార్ వస్తోంది. కానీ ఏ తెలుగు నిర్మాత పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఒకరిద్దరు చిన్న నిర్మాతలు ఆసక్తి కనబర్చినా, అయిదు నుంచి ఆరుకోట్ల వరకు వెళ్లి ఆగిపోయారు. ఆఖరికి నవాబ్ ను కొన్న అశోక్ నే ధైర్యంచేసి ఆరున్నర కోట్లకు సర్కార్ హక్కులు కొన్నారు. అది కూడా కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే.
విశాల్ సినిమా పందెం కోడిని కూడా ఆరున్నరకే కొన్నారు నిర్మాత టాగోర్ మధు. ఆయనకు విశాల్ అనుబంధం వుండడం, విశాల్ హీరోగా టెంపర్ రీమేక్ చేస్తుండడం వల్ల ధైర్యం చేసికొన్నారు. ఆరున్నరకు కొంటే సరిపోదు. పబ్లిసిటీకి కనీసం కోటి నుంచి రెండుకోట్లు, విడుదల ఖర్చులు అన్నీ కలిపి పది కోట్లకు డేకేస్తాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేవలం థియేటర్ల మీద డబ్బింగ్ సినిమాకు పదికోట్ల మార్కెటింగ్ చేయాలంటే కష్టమే. ఆంధ్రను అయిదారు కోట్ల రేషియోలో, సీడెడ్ మూడుకోట్ల రేషియోలో అమ్మి, నైజాం ఎలాగూ అమ్మడం కుదరదు కాబట్టి, రిస్క్ కు వుంచేసుకోవాలి.
నవాబ్ ఫరవాలేదు అనిపించుకుంది. సర్కార్, పందెంకోడి కూడా బాగుండే అప్పుడు మళ్లీ డబ్బింగ్ సినిమాల మార్కెట్ ఊపు అందుకుంటుందేమో?