మూడున మూడూ మూడే

మళ్లీ శుక్రవారం వస్తోంది. ఈ వారం మూడు సినిమాలు విడుదలవుతున్నాయ. ఒకే రోజు మూడు సినిమాలు విడుదల కావడం వింతా కాదు, విడ్డూరమూ కాదు. అయితే ఈ వారం విడుదలవుతున్న మూడు సినిమాలు కాస్త…

మళ్లీ శుక్రవారం వస్తోంది. ఈ వారం మూడు సినిమాలు విడుదలవుతున్నాయ. ఒకే రోజు మూడు సినిమాలు విడుదల కావడం వింతా కాదు, విడ్డూరమూ కాదు. అయితే ఈ వారం విడుదలవుతున్న మూడు సినిమాలు కాస్త విశేషమైనవే. ప్రేక్షకులకు కాకపోవచ్చు. కానీ ఆయా సినిమా జనాలకు అవి కాస్త స్ఫెషలే.

గరుడ వేగ

హీరో రాజశేఖర్ నటించిన సినిమా ఇది. ఒకప్పుడు ఆయన నటించిన అంగరక్షకుడు, మగాడు, లాంటి సినిమాలు తలుచుకుంటే, ఇప్పటికీ కత్తిలాంటి సినిమాలు అనిపిస్తాయి. ఆ సినిమాల్లో యాంగ్రీ యంగ్ మన్ గా రాజశేఖర్ నటన అలాంటిది. అలాంటి హీరో రాజశేఖర్ అన్ని విధాలా వెనక పడ్డారు. కనీసం క్యారెక్టర్ యాక్టర్ గా కూడా మిగలలేదు.

ఇలాంటి టైమ్ లో గరుడ వేగ అంటూ ఓ కథను దర్శకుడు ప్రవీణ్ సత్తారు వినిపించారు. ఇంత భారీ కథకు ఆయన రాజశేఖర్ ను ఎంచుకోవడమే ఓ కీలకం. రాజశేఖర్ మీద భారీ డబ్బులు పెట్టడానికి మాంచి నిర్మాత ముందుకు రావడం అంతకన్నా కీలకం. టీజర్, ట్రయిలర్ బాగానే వచ్చాయి. టేకింగ్ పరంగా ఓకె అన్నట్లే వుంది. కానీ రాజశేఖర్ లో మునపటి జోష్ వుండాలి. అది వుంటే చాలు సినిమా నడచిపోతుంది.

అందువల్ల ఈ సినిమా హీరో రాజశేఖర్ కు అత్యంత కీలకం. అంతే కాదు, తను ఈ తరహా సినిమాలు కూడా చేయగలనని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రూవ్ చేసుకొవడానికి ఇదే కీలకం.

ఏంజెల్

సిందూర పువ్వు కృష్ణా రెడ్డిగా పేరు తెచ్చుకున్న నిర్మాత తనయుడు నాగ అన్వేష్. వినవయ్యా రామయ్యా సినిమాతో తెరంగ్రేటం ఛేసాడు. కుర్రాడు ఇంకా ముదరాలి. కాస్త కండబట్టాలి అన్న అభిప్రాయాలు వినరావడంతో కాస్త గ్యాప్ ఇచ్చి, కండలు పెంచి, సోషియో ఫాంటసీ సినిమా ఏంజెల్ తో మళ్లీ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

పళని అనే కొత్త డైరక్టర్ అందించిన సోషియో ఫాంటసీ కథ ఇది. ఇప్పుడు అంతా విజువల్ ఎపెక్ట్స్ వ్యవహారం నడుస్తుండడంతో, క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం కాస్త బాగానే ఖర్చుచేసారు. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు కృష్ణారెడ్డి ఖర్చుకు వెనుకాడలేదు. 

ఈ సినిమాకు గ్రాఫిక్స్, సోషియో ఫాంటసీ లైన్ తరువాత మరో అనుకూల అంశమేమిటంటే కమెడియన్ సప్తగిరి. ఈ మధ్య కాలంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం ఈ సినిమాలోనే. చాలా సినిమాల్లో చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ, హీరోగా ప్రయత్నిస్తున్న సప్తగిరి ఈ సినిమాలో ఆద్యంతం కనిపించి నవ్విస్తాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ సినిమా బాగా అందంగా కనిపించిందన్న టాక్ వుంది.

ఇలాంటి ప్రత్యేకతలున్న ఈ సినిమా హీరో నాగ్ అన్వేష్ కు చాలా కీలకం. ఒక విధంగా హీరోగా ఇదే తొలిసినిమా. మొదట చేసింది రిహార్సల్ అనుకోవాలి. ఈ సినిమాతోనే ప్రూవ్ చేసుకోవాలి. ఇండస్ట్రీలో హీరోల కొరత చాలా వుంది. నాగ్ అన్వేష్ ప్రూవ్ చేసుకుంటే చాన్స్ లు వస్తాయి. అందువల్ల ఈ సినిమా అతనికీ కీలకమే.

NEXT నువ్వే

కెరీర్ టర్నింగ్ ఇచ్చుకోవడానికి సరైన హిట్ కోసం చూస్తున్నాడు ఆది సాయికుమార్. అదే సమయంలో టీవీ నుంచి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి, టాలెంట్ నిరూపించుకోవడానికి చూస్తున్నాడు ఈటీవీ ప్రభాకర్. మరోపక్క చిన్న సినిమాలు పెద్దగా నిర్మించడానికి కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేసింది గీతా ఆర్ట్స్. ఈ మూడింటి కలయికే next నువ్వే. 

తమిళ సినిమా యామిరుక్కు భయమే సినిమాకు తెలుగు రీమేక్ ఇది. ఇప్పుడు జనాలు ఎక్కువగా చూస్తున్న హర్రర్ కామెడీ జోనర్. అది ఈ సినిమాకు ప్లస్ పాయింట్. గరుడ వేగ, ఏంజెల్ సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో తయారైంది. కాబట్టి కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్టు అనుకోవచ్చు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా ఎదుగుతున్న బన్నీ వాస్ కు కూడా ఈ సినిమా విజయం అవసరమే.

మౌత్ టాక్ కీలకం

మూడు సినిమాలు యథాశక్తి ప్రచారం సాగించినా, ఓపెనింగ్స్ పై పెద్దగా ఆశలు వుండవు. ఎందుకంటే ఈ మధ్య మన జనాలు మీడియం, చిన్న సినిమాలు అంటే పెద్దగా ఆశక్తి చూపించడం లేదు. పెద్ద బ్యానర్ అయితే తప్ప. అందువల్ల తొలి రోజు ఆట పడిన తరువాత వచ్చే మౌత్ టాక్ మాత్రమే ఈ సినిమాలకు శ్రీరామ రక్ష.