బాలీవుడ్‌లో ఒకప్పుడు బ్యాడ్ బాయ్‌గా విమర్శలు ఎదుర్కొన్న సంజయ్‌దత్‌కి, ‘మున్నాభాయ్’ సిరీస్ సినిమాలు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టాయి. సంజయ్‌దత్ మంచి వ్యక్తి, మానవత్వం ఉన్నవాడంటూ.. అందరూ ఇప్పుడు కొనియాడుతున్నారంటే అదంతా ‘మున్నాభాయ్’ సిరీస్ సినిమాల పుణ్యమే. తెలుగులో ‘శంకర్‌దాదా’ సిరీస్ సినిమాలు చిరంజీవి హీరోగా వచ్చాయి.. అవన్నీ ‘మున్నాభాయ్’కి తెలుగు వెర్షన్లేనన్న విషయం అందరికీ తెల్సిందే.
ఇప్పుడంతే ఎంత మంచితనం వున్నా, గతంలో చేసిన పొరపాట్లు, లేదంటే పాపపు కార్యక్రమాలు.. ఎలాగైనా అనండి, అతను చేసిన పనులు అతన్నిప్పుడు జైలు ఊచల వెనక్కి నెట్టాయి. ముంబై బాంబు పేలుళ్ళ కేసులో అక్రమాయుధాలు కలిగి వున్న కారణంగా సంజయ్‌దత్‌కి జైలు శిక్ష పడింది. గతంలో కొంత శిక్ష అనుభవించిన సంజయ్‌దత్ ఇప్పుడు మిగిలిన శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే, సంజయ్‌దత్‌ని బయటకు తీసుకొచ్చి, తమ పార్టీకి సినిమా గ్లామర్ కల్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అధికారం తమ చేతిలో వుంటే ఏమైనా చేయొచ్చు.. అన్న దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
దాంతో, ఒక్కసారిగా దేశమంతా షాక్‌కి గురయ్యింది. న్యాయస్థానం నిర్ధారించింది గనుక, సంజయ్‌దత్ నేరస్తుడే. నేర చరిత ఒకప్పటిదే అయినా శిక్ష పడింది కాబట్టి, ఆ శిక్ష అనుభవించి తీరాలి. లేదంటే, నేరం చేయాలనుకునేవారికి భయమే లేకుండా పోతుంది. సంజయ్‌దత్ ఇప్పుడెంత మంచోడు.? అన్నదానిపై రాజకీయ చర్చ జరగడం అత్యంత హాస్యాస్పదం.
సంజయ్‌దత్ అంటే ఇప్పుడందరిలోనూ మంచి భావన వున్నప్పటికీ, అతనికి క్షమాభిక్ష పెట్టాలన్న వాదనతో దేశంలో ఎవరూ ఏకీభవించని పరిస్థితి. ఎందుకంటే, అతను గతంలో పాల్పడ్డ నేరం అలాంటిది. నేరము ` దానికి తగిన శిక్ష వుంటేనే కదా.. నేరం చేయడానికి బఎవరైనా భయపడేది.!
ఏమో, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోగానీ, రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనడానికి సంజయ్‌దత్ పేరుతో రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నవారి రాజకీయ ఆలోచనలు, ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.