మైత్రీ స్పీడుకు బ్రేకులు

శ్రీమంతుడు సినిమాతో సర్రున టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ఆ బ్లాక్ బస్టర్ వచ్చి ఏడాది తిరక్కుండానే మళ్లీ జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తెచ్చారు. కానీ ఇప్పుడు మూడో…

శ్రీమంతుడు సినిమాతో సర్రున టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ఆ బ్లాక్ బస్టర్ వచ్చి ఏడాది తిరక్కుండానే మళ్లీ జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తెచ్చారు. కానీ ఇప్పుడు మూడో సినిమా అంత వీజీగా కనిపించడం లేదు. అలాగే ఆ తరవాత సినిమా ఏమిటన్న దాంట్లో క్లారిటీ లేదు. పోనీ అలా అని ఫైనాన్స్ నో, అడ్వాన్స్ లో సమస్య అనుకుంటే కానే కాదు. సుకుమార్, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, హను రాఘవపూడి ఇలా ఎవరు పడితే వాళ్ల దగ్గర మైత్రీ అడ్వాన్స్ లు వున్నాయి. కానీ సినిమాలు సెట్ కావడం అంత సులువుగా కనిపించడం లేదు. 

ప్రస్తుతానికి రామ్ చరణ్ తో సుకుమార్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కావాలి. రెండు నెలల కిందటి నుంచే పూజ అంటున్నారు కానీ, అదే కనిపించడం లేదు. చరణ్ పేరు చెప్పి, నిర్ణయాలు తీసుకుంటున్న చరణ్ టీమ్ కు సుకుమార్ కు అంతగా పొసగడం లేదని వినికిడి. దానికి తోడు ధృవ అలా అలా మెల్లగా డిసెంబర్ వరకు వచ్చింది. ఆ సినిమా విడుదల, ప్రమోషన్లు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ జరిగి రామ్ చరణ్ ఫ్రీ కావాల్సి వుంది. హీరోయిన్ తో సహా స్టార్ కాస్ట్ సెట్ కావాలి. పైగా తోట తరణి, ఏకంగా ఓ గోదావరి విలేజ్ నే సృష్టించాల్సి వుంది. ఇవన్నీ అంత సులువుగా జరిగే పనులు కావు.

అప్పుడు సుకుమార్ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. అంటే ఇదిగో అదిగో అని మార్చి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే జనవరి అంతా చరణ్ నిర్మాతగా తన తొలి సినిమా ఖైదీ నెం 150తో బిజీగా వుంటారు. ఫిబ్రవరి లేదా మార్చికి షూటింగ్ స్టార్ట్ అయితే సుకుమార్ స్టయిల్ మేకింగ్ కు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. అంటే 2017 ఎండ్ కు రెడీ అవుతుందేమో? 

పోనీ స్లయిమెంటేనియస్ గా మరో సినిమా చేద్దాం అంటే మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్రీ కావాలి. మహేష్ 2017 ఎండ్ కు కానీ ఫ్రీ కాడు. త్రివిక్రమ్ ఎప్పటికి ఫ్రీ అవుతారో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సింది పవన్ సినిమా. అది ఎప్పుడు  ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుందో, ఎవరికీ తెలియదు. 

పోనీ బోయపాటి శ్రీనుతో సినిమా చేద్దామా అంటే ఆయనేమో చిరు సినిమాకు ఫిక్సయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అడ్వాన్స్ లు తీసుకున్నవారంతా ఏదో సినిమాతో బిజీగా వున్నారు. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ ఖాళీగా వుండాల్సి వస్తోంది. డబ్బులు వుండి కూడా.