ఒకేసారి మూడు ప్రాజెక్టులు చేపట్టాడు.. కానీ ఆ మూడింటిలోనూ దాసరి నారాయణ రావుతో తను చేస్తాను అని ప్రకటించిన సినిమా మాత్రం లేకపోవడం ఒకింత విడ్డూరమే! ఇప్పటి వరకూ జరగని రీతిలో ఏకంగా ఒకేసారి మూడు సినిమాలను చేపట్టిన పవన్ కల్యాణ్ దాసరిని మాత్రం విస్మరించినట్టుగా అగుపిస్తోంది. చేస్తాం.. అని సంచలన రీతిలో ప్రకటించి, ఉంటుంది, తప్పకుండా.. అనే మాటలతో నడిచిన ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంలో పడినట్టే!
మూడు సినిమాలను చేపట్టిన పవన్ వాటిల్లో ఒకదాంట్లో అయినా దాసరిని ఏదో విధంగా భాగస్వామిని చేసి ఉంటే.. ఆ ముచ్చట ఏదో ముగిసేది. అయితే అది జరగలేదు. తన సన్నిహితుడు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో అయినా దాసరిని భాగస్వామిని చేసి ఉండాల్సింది అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.
ఈ మూడు సినిమాల తర్వాత పవన్ తన సినీ కెరీర్ కు విరామం ఇస్తాడనే ప్రచారం ఎలాగూ ఉండనే ఉంది. ఇవి పూర్తి అయ్యి.. విడుదల అయ్యే సరికి 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఆ ఎన్నికల్లో తను ప్రత్యక్షంగా బరిలోకి దిగుతాను అని కూడా పవన్ ఇప్పటికే ప్రకటించాడు. చిరంజీవి 2009 ఎన్నికల ముందు సినిమాలను ఆపేసినట్టుగా.. పవన్ కూడా సినిమాలను ఆపేస్తున్నాడు. మళ్లీ పవన్ సినిమాలు చేయడని కాదు.. కొంత విరామం అయితే ఉంటుంది. ఆ వ్యవధి కొన్ని సంవత్సరాల పాటు అయ్యుండొచ్చు.
అప్పటికి రాజెవరో, రౌతెవరో.. విరామానంతరం పవన్ సినిమాలు చేసే సమయానికి దాసరికి ఓపిక ఉంటుందో ఉండదో.. ఓవరాల్ గా వెటరన్ దాసరితో పవన్ సినిమా.. అనే ఆసక్తికరమైన ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఏ మాత్రమూ కనిపించడం లేదు!