నాగ్ చైతన్య చేతిలో చాలా సినిమాలు వున్నాయి. ఇప్పుడు రెండు ఆల్ మోస్ట్ ఒకేసారి రెడీ అవుతున్నాయి. మారుతి డైరక్షన్ లో శైలజరెడ్డి అల్లుడు, అలాగే చందు డైరక్షన్ లో సవ్యసాచి. ఈ రెండు సినిమాల తరువాత చేస్తున్న సినిమా శివనిర్వాణ డైరక్షన్ లో వుంటుంది. ఈ సినిమా జూలై ఆఖరు నుంచే సెట్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో సమంత-నాగ్ చైతన్య కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
పెళ్లయిన తరువాత ఆ ఇద్దరు తెరమీద జంట నటించడం ఇదే. అయితే సినిమాలో కూడా సమంత-చైతన్య ఇద్దరూ పెళ్లయిన జంటగానే కనిపిస్తారని తెలుస్తోంది. పెళ్లయి కాపురం చేసుకునే ఈ ఇద్దరి మధ్యకు మరో అమ్మాయి ప్రవేశించడం, ఆ అమ్మాయి చైతూను ఇష్టపడడం, ఆమెను ఇంటికి తీసుకువచ్చి, తమది అన్యోన్య దాంపత్యం అని చూపించడం లాంటి వ్యవహారం ఏదో వుంటుందని తెలుస్తోంది. అంటే దాదాపు మళ్లీ నిన్ను కోరి సినిమా లైన్ కు దగ్గరగా వుండేలా కనిపిస్తోంది.
అంటే చైతూ ఈ సినిమాలో సమంతతో పాటు మరో హీరోయిన్ తో కూడా కనిపిస్తాడన్నమాట. శైలజరెడ్డి అల్లుడు ఫ్యామిలీ స్టోరీ, సవ్యసాచి యాక్షన్ సినిమా, శివనిర్వాణ సినిమా లవ్ జోనర్. చైతన్య చాలా పక్కాగా, జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.