నాగ్ కన్నా మహేష్ బెటర్

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటేసాక బోడి మలన్న అంటే సరి కాదు. సినిమా హిట్ అయితే మన ప్రతిభ లేదూ అంటే డైరక్టర్ ఫాల్ట్ అనడం అంతకన్నా సరికాదు. అన్నీ చూసి,…

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటేసాక బోడి మలన్న అంటే సరి కాదు. సినిమా హిట్ అయితే మన ప్రతిభ లేదూ అంటే డైరక్టర్ ఫాల్ట్ అనడం అంతకన్నా సరికాదు. అన్నీ చూసి, అన్నీ విని దర్శకుడికి అవకాశం ఇచ్చిన తరువాత హీరోలది కూడా బాధ్యత వుంటుంది. వుండాలి కూడా. మహేష్ బాబు మొన్నటికి మొన్న స్పైడర్ ఫంక్షన్ లో మాట్లాడుతూ దర్శకులు తనకు దేవుళ్లు అని చెప్పుకొచ్చాడు. ఒకసారి వాళ్లతో జతకడితే వాళ్లకు ప్రాణం ఇచ్చేస్తా అని, అందుకే తనకు మంచి సినిమాలు వచ్చాయని, అందుకే ఇలా వున్నానని వివరించాడు.

కానీ ఇదే నాగార్జున వైనం చూస్తే చిత్రంగా వుంటుంది. ఒక్క భాయ్ సినిమా ఫ్లాప్ అయితే పది సార్లు, పది సందర్భాల్లో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఇజ్జత్ తీసేసాడు. అంతకు ముందు రెండు హిట్ లు ఇచ్చాడు అనే కదా అవకాశం ఇచ్చింది. ఓ ఫ్లాప్ వస్తే, మొత్తం చౌదరి ఖాతాలో వేసేసి తాను తప్పుకున్నాడు. అలాగే రెండు మాంచి హిట్ లు ఇచ్చాడు ఫ్యామిలీకి కళ్యాణ్ కృష్ణ. అసలు నాగ్ కెరీర్ లోనే ఇటీవల పెద్ద హిట్ సోగ్గాడే చిన్ని నాయనా. ఆపైన చైతూ కోసం రారండోయ్ వేడుక చూద్దాం అందించాడు.

అలాంటి డైరక్టర్ విషయం కూడా జస్ట్ అలా తీసిపారేసాడు నాగ్ ఇటీవల. మీడియా జనాలు బంగార్రాజు సినిమా గురించి అడిగితే, కథ సెట్ కావాలి, చూడాలి అని చెప్పకుండా, కళ్యాణ్ కృష్ణ కథ తెచ్చాడు. నచ్చలేదు. మంచి కథ వస్తే అప్పుడు చూద్దాం అనేసాడు. రెండు సినిమాలతో వచ్చిన క్రెడిట్ అంతా, పాపం, ఒక్క సినిమాకు కథ సెట్ చేయలేకపోయాడు అన్నట్లు అయిపోయింది.

ఆ లెక్కన చూస్తే మహేష్ బాబు బ్రహ్మోత్సవం డైరక్టర్ శ్రీకాంత్ గురించి ఎన్ని మాట్లాడాలి? ఒక్క మాట కూడా అనలేదు. ప్రస్తావించలేదు. నాగ్ ఈ విషయం అబ్జర్వ్ చేస్తే మంచిదేమో?