మొన్న సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా, ఇప్పుడు రారండోయ్ వేడుక చూద్దాం, రెండు హిట్ లు అందించాడు నిర్మాతగా నాగార్జున. మిగిలిన సీనియర్ హీరోలు చేయని ధైర్యం చేస్తున్నాడు నాగ్. కొత్తవాళ్లకి అవకాశం ఇస్తూ, నిర్మాతగానూ, నటుడిగానూ, పైగా ఫాదర్ గా కూడా సక్సెస్ లు చవిచూస్తున్నాడు. దీని వెనక నాగ్ స్ట్రాటజీ వేరుగా వుందట.
కొత్త డైరక్టర్ కు లైన్ విని అవకాశం ఇవ్వడం, అన్ని విదాలా సరైన జనాలని అతని చుట్టూ పెట్టడం, ఆ తరువాత తను ప్రొడక్ట్ చూసి సెట్ చేయడం అన్నది ఆ స్ట్రాటజీ అంట. సోగ్గాడే చిన్ని నాయనా సమయంలో అంతా అయిన తరువాత కటింగ్ లు, రీషూట్ లు చేసాడు. అలాగే రారండోయ్ వేడుక చూద్దాం టైమ్ లో కూడా చాలా నిర్మొహమాటంగా వ్యవహరించాడట.
సినిమా అంతా అయిన తరువాత విడుదలకు నెల రోజుల ముందు సినిమా చూసిన నాగ్ కు చిర్రెత్తుకు వచ్చిందని వినికిడి. దాంతో డైరక్టర్ ను, ఎడిటర్ ను పక్కన పెట్టుకుని కూర్చుని, సీన్లు వరుసపెట్టి కోత కోయించేసాడట. సినిమాకు సంబంధం లేని చాలా అంటే చాలా సీన్లు నాగ్ కత్తెరకు ఎగిరిపోయాయట. డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ ఏం చెప్పబోయినా నాగ్ వినలేదని తెలుస్తోంది. మఖ్యంగా ప్రారంభంలో రఘుబాబు, పృధ్వీ, పోసాని, తాగుబోతు రమేష్ లపై తీసిన సీన్లు చాలా అంటే చాలా నాగ్ కత్తెరకు బలైపోయాయట.
అలాగే సినిమా అంతా చూసి, సెన్సారు కు వారం రోజుల ముందు సినిమాలో కీలకమైన కబడ్డీ సీన్ ను జోడించమని సూచించింది నాగ్ నే నట. అప్పటికప్పుడు షూట్ చేసి, జోడించారట. ఇలా సీన్లు తీసేసే విషయంలో నిర్మొహమాటంగా వుండి, సినిమాపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో రారండోయ్ సినిమా గట్టెక్కేసింది.