'' ఊరక రారు మహాను భావులు…'' అని అంటారు. తమిళ హీరోలు కూడా అంతే.. తెలుగు వైపు ఏదో ప్రత్యేకమైన కారణం లేని రారు. తమ సినిమాలు విడుదలకు సమయం దగ్గరపడే వరకూ వీరు వారి పనుల్లో వారుంటారు. ఆ సినిమాలు ఆడియో విడుదల వరకూ వచ్చిందో పరిస్థితి మారిపోతుంది.
తెలుగు చానళ్లను పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తారు.. తెలుగు గడ్డతో, తెలుగు వాళ్లతో తమకున్న అనుబంధాన్ని వారు చాలా భావోద్వేగంగా వివరించి చెబుతారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ తీరుకు మినహాయింపేమీ కాదు!
తన సినిమాలకు తెలుగునాట మంచి మార్కెట్ ను కలిగి ఉన్న కమల్ తన సినిమా ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యాకా ఇటువైపు కన్నేస్తాడు. ప్రతిసారీ ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే.. ఈ సారి కమల్ మరో అడుగు ముందుకేసి… హీరో నాగార్జునను కూడా కొంత వాడుకొన్నాడు.
ఇప్పుడు తెలుగు టెలివజన్ ట్రెండ్ చార్ట్ లో “మీలో ఎవరు కోటీశ్వరుడు''ప్రోగ్రామ్ టాప్ పొజిషన్ లో ఉంది! ఈ కార్యక్రమంలో ఇటీవలే కమల్ సందడి చేశాడు. తద్వారా తన రాబోయే సినిమా “ఉత్తమ విలన్'' కు ప్రచారం మొదలు పెట్టేశాడు! తెలుగు టీవీల వాళ్లను పిలిపించుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడం కన్నా..మా టీవీలో ప్రసారం అయ్యే “మీలో ఎవరు కోటీశ్వరుడు'' లో పాల్గొనడం ద్వారా ఎక్కువ ప్రచారం వస్తుందనే పాయింట్ ను కమల్ బాగా క్యాచ్ చేశాడు!
ఇక నాగార్జున హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ కు కూడా కమల్ గెస్టప్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది. అభిమానులు అంతా ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా చూస్తారు. ఉభయ కుశలోపరి. ఉన్నఫలంగా కమల్ హాసన్ మీలో ఎవరు కోటీశ్వరుడు లో కనపడటం వెనుక ఉన్న కథ ఇదీ!