ఏ హీరోకి అయినా కెరీర్ అలా అలా ఒక లెక్క ప్రకారం సాగుతుండాలి. మరీ గ్యాప్ వస్తే జనాలు మరిచిపోయే ప్రమాదం వుంది. పవన్ కళ్యాణ్ నో, మహేష్ బాబునో అంటే అది వేరు. కానీ నాగశౌర్య వంటి హీరోలు కనీసం ఆరు నెలలకయినా ఓ సినిమా ద్వారా తెరముందుకు వచ్చి, జనాలను పలకరిస్తుండాలి. అలా ప్లానింగ్ చేసుకోకపోతే, సినిమాలకు బజ్ రావడం కష్టం. ఓపెనింగ్స్ రావడం అంతకన్నా కష్టం.
నాగశౌర్య సినిమా వచ్చి, ఏడాది మీద రెండు నెలలు దాటింది. చేతిలో సినిమాలు వున్నాయి. తమిళ-తెలుగు ఉభయభాషా సినిమా, స్వంత సినిమా రెండూ రెడీ అవుతున్నాయి. మరో రెండు సినిమాలు సైన్ చేసాడు. కానీ సుఖమేముంది? ఒక్కటి కూడా విడుదలకు దగ్గరగా లేవు.
నవంబర్ లో ఒక సినిమా డిసెంబర్ లో ఒక సినిమా అని అంటున్నారు కానీ, ఇప్పటికి ఏదీ డేట్ కన్ ఫర్మ్ గా చెప్పలేదు. మరో పక్క చాలా సినిమాలు ముందుగానే డేట్ల పై రుమాళ్లు వేసేస్తున్నాయి. ఇలాంటపుడు నాగశౌర్య ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ వుంటే ఎలా? సినిమా చేయడం ఒకటే కాదు, టైమ్ కు , అదీ సరైన డేట్ చూసుకురావడం అంతకన్నా కీలకం.
ఏదైనా నాగశౌర్య ప్లానింగ్ ఎక్కడో బెడిసికొట్టింది. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచీ పబ్లిసిటీ చేసుకుని, సినిమాకు బజ్ పెంచుకుని, ముందుకు వెళ్తే తప్ప, ఓపెనింగ్స్ మాట దేవుడెరుగు, బయ్యర్లు గట్టెక్కడం కష్టమవుతుంది.