సూపర్ హిట్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. హీరో, విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ను చంపేశారనేది ఆ డైలాగ్. ఇప్పుడీ డైలాగ్ నాగబాబుకు సరిగ్గా సరిపోతుంది. పవన్, రోజా ఎపిసోడ్ మధ్య ఇప్పుడు నాగబాబు నలిగిపోతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ తో తెగ ఇబ్బంది పడుతున్నారు.
పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రోజాతో కలిసి జబర్దస్త్ అనే కామెడీ కార్యక్రమం చేస్తున్నాడీయన. అందులో పేలే జోకులకు ఇద్దరూ పడీపడీ నవ్వుకుంటారు. నాగబాబు అయితే మరీను. అతడి నవ్వుకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఓ బ్రాండింగ్ కూడా ఉంది.
ఇకపై నాగబాబు అలా మనస్ఫూర్తిగా నవ్వగలరా.. పక్కన రోజా కూర్చుంటే ప్రశాంతంగా ఉండగలరా.. తాజాగా జరిగిన పరిణామాలు జనాల్లో ఈ డౌట్స్ రేకెత్తిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను “వాడు..వీడు” అనేశారు రోజా.
“చిరంజీవి అనే మెగాస్టార్ లేకపోతే పవన్ కల్యాణ్ ఎవడు..? పవన్ ను పెట్టి ఎవడు సినిమా తీస్తాడు..? ఎవడు చూస్తాడు..?” రోజా మాటల తూటాల్లో ఇది ఒక తూటా మాత్రమే. బండ్ల గణేష్ కు ఇదే నచ్చలేదు. ఏక వచనంలో తమ నాయకుడ్ని పిలవడం కోపం తెప్పించింది. అలా ప్రారంభమైన మాటల యుద్ధం “పక్కలు పరుస్తావ్” అని తిట్టుకునే స్థాయికి చేరింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లోకి ఇప్పుడు నాగబాబును లాగేస్తున్నారు నెటిజన్లు, పవన్ అభిమానులు. పవన్ ను అన్నేసి మాటలంటున్న రోజాతో కలిసి జబర్దస్త్ చేయొద్దనేది వీళ్ల వాదన. అసలు జబర్దస్త్ నుంచి రోజాని తీసేయాలని, లేదంటే నాగబాబు తప్పుకోవాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఓ సెక్షన్ వెళ్లి ఈ తతంగం మొత్తం నాగబాబు చెవిలో ఊదేసింది.
ఈ మొత్తం ఎపిసోడ్ తో ఇప్పుడు నాగబాబు కార్నర్ అయ్యారు. రోజాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు. నిజానికి పవన్ పై రోజా విమర్శలు చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలోనే చాలా చేశారు. అప్పుడు నాగబాబుపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ ఈసారి ఆ విమర్శలు హద్దులు దాటాయి. చిరంజీవితో పాటు మొత్తం మెగా కాంపౌండ్ హీరోల్నే అవమానించే రేంజ్ కు చేరుకున్నాయి.
ఈసారి నాగబాబు రియాక్ట్ అవ్వక తప్పదు. ఎప్పుడూ చెప్పినట్టే ఈసారి కూడా రాజకీయాలు వేరు, వినోదం వేరు అంటే కుదరదు. ఎందుకంటే ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తీసుకోవడం ఖాయం. అలాంటప్పుడు పగలంతా పవన్, చిరంజీవిని తిట్టి సాయంత్రం తన పక్కకొచ్చి కూర్చునే రోజాతో కలిసి షో ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్టో నాగబాబు ఆలోచించుకోవాలి. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్, నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ లో అస్సలు తప్పులేదు.