ఈ రెండు సినిమాల్లో ఏది రొటీన్, ఏది వెరైటీ..? కేవలం 24గంటల వ్యవధిలో వస్తున్న హలో, ఎంసీఏ మూవీస్ పై ఆడియన్స్ లో ఇదే తరహా చర్చ జరుగుతోంది. నాని మార్క్ మేనరిజమ్స్, రొటీన్ పాటలు, కామెడీ చూడాలనుకుంటే ఎంసీఏ చాలని.. కాస్త వెరైటీ కథ, కథనం, యాక్షన్ కావాలనుకుంటే హలో చూడాలనే డిస్కషన్ నడుస్తోంది. నిజానికి ఈ చర్చలో కొంత వాస్తవం కూడా ఉంది.
దిల్ రాజు, నాని బ్యాచ్ తీసే సినిమాల్లో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఊహించలేం. మరీ రొటీన్ అని తీసిపారేయలేం కానీ 'ఔట్ ఆఫ్ ది బాక్స్' కంటెంట్ మాత్రం కనిపించదు. ఆ విషయాన్ని తాజాగా వాళ్లు రిలీజ్ చేసిన ట్రయిలర్ కూడా చెప్పేస్తోంది. అన్న, వదిన, మరిది, ఓ సంఘర్షణ, మధ్యలో హీరోయిన్.. ఇలా ఉండబోతోంది ఎంసీఏ సినిమా.
హలో విషయానికొచ్చేసరికి మాత్రం ప్రేక్షకుల్లో కాస్త క్యూరియాసిటీ కనిపిస్తోంది. దీనికి కారణం కేవలం దర్శకుడు విక్రమ్ కుమార్. ఈ డైరక్టర్ రాసుకునే కథల్లో, చూపించే సన్నివేశాల్లో కచ్చితంగా ఫ్రెష్ ఫీల్ ఉంటుందనే ఇమేజ్ ఉంది. దానికి తోడు ట్రయిలర్, టీజర్ లో కొత్త తరహా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాల్ని పెంచాయి.
ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ సినిమా కథ ఉదయం 10గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగుస్తుందంటూ నాగ్ చేసిన ప్రకటన హలోపై కాస్త ఆసక్తిని రేపింది. ఎంసీఏకు సంబంధించి నాని బండి లాగించేస్తాడనే భరోసా అందర్లో ఉంది. కాబట్టి ఇది సేఫ్ ప్రాజెక్టు. ఎటొచ్చీ 'హలో'లో మాత్రం కొత్తదనం కనిపించి తీరాలి. అది కూడా ఆకట్టుకునే విధంగా ఉండాలి. లేదంటే మరోసారి అక్కినేని కాంపౌండ్ కు ఆశాభంగం తప్పదు.