అక్కినేని నాగార్జున, తన చిన్న కుమారుడు అఖిల్ కెరీర్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. ఏ కాంబినేషన్‌ని సెట్ చేయాలనుకున్నా, అఖిల్ ససేమిరా అంటున్నాడట. ఏవేవో చెబుతూ, నాగ్ సెట్ చేస్తున్న ప్రాజెక్టుల్ని అఖిల్, 'ట్రాష్' చేసేస్తున్నాడంటూ టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్న విషయం విదితమే.
తాజాగా, అక్కినేని నాగార్జున – అఖిల్ కోసం మరో కొత్త ప్రాజెక్ట్‌ని సెట్ చేసే ప్రయత్నాల్లో బిజీగా వున్నాడన్నది టాలీవుడ్‌లో విన్పిస్తోన్న హాటెస్ట్ గాసిప్. తాను హీరోగా నటించిన 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో వుంది నాగార్జునకి. ఆ సీక్వెల్‌ని అఖిల్‌తో చేయిస్తే ఎలా వుంటుంది.? అన్న ఆలోచన చేస్తున్నాడట నాగ్ ఇప్పుడు. అయితే ఆ సినిమాకి సీక్వెల్‌ని డీల్ చేయాలంటే, దానికి త్రివిక్రమ్ అయితేనే బావుంటుందనేది నాగార్జున అభిప్రాయం.
కానీ, ప్రస్తుతానికి త్రివిక్రమ్ షెడ్యూల్ చాలా బిజీగా వుంది. పవన్, మహేష్, అల్లు అర్జున్.. ఇలా చాలామంది (ఓ అరడజను వరకు) హీరోలు త్రివిక్రమ్‌తో సినిమా కోసం లైన్‌లో వున్నారు. వారందర్నీ కాదని, అఖిల్‌తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశముందా.? అంటే, నాగ్ అడిగితే బహుశా త్రివిక్రమ్ కాదనకపోవచ్చు.
అయితే, ఇక్కడా ఓ సమస్య వుంది. తీరా, నాగార్జున – త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని ఒప్పించినా, అఖిల్ ఒప్పుకుంటాడా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.