తనకు అర్జున్ కపూర్ కేవలం స్నేహితుడు మాత్రమే అని అంటోంది మలైకా అరోరా. గత కొన్ని రోజులుగా అర్జున్- మలైకాల బంధం గురించి రకారకాల ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఈ అంశంపై వివరణ ఇచ్చింది మలైక. ఈ అంశం గురించి ఇప్పటి వరకూ అర్జున్ మాట్లాడకపోయినా.. మలైక మాత్రం స్పందించింది.
అర్జున్ తో తనకు ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని.. అయితే దాన్ని చాలా మంది నమ్మరని నిర్వేదాన్ని వ్యక్తం చేసింది. దాదాపు దశాబ్దం పైనే అర్బాజ్ ఖాన్ తో దాంపత్యాన్ని కొనసాగించిన మలైక కొంత కాలం కిందట భర్త నుంచి వేరుపడిన సంగతి తెలిసిందే. వీరు తాజాగా విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు.
భర్తతో మలైక బంధం చెడిపోవడానికి కారణం అర్జున్ కపూరే అనే మాట వినిపించింది. మలైక- అర్బాజ్ లను రాజీ చేయడానికి ఇంట్లో వాళ్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు దానికి కారణం కూడా అర్జునే అని వార్తలు వచ్చాయి. అయితే అర్జున్ తనకు స్నేహితుడు మాత్రమే అని మలైక స్పష్టం చేసింది.
మరి ఇప్పటికే సల్మాన్ ఖాన్ కూడా అర్జున్ పై కోపంతో ఉన్నాడని, ఇటీవల సానియా సోదరి వివాహానికి హాజరైనప్పుడు కూడా అర్జున్ ను సల్లూ దూరంగా పెట్టాడనే వార్తలు వచ్చాయి. అర్జున్ పై సల్లూకు కోపం తీవ్రస్థాయిలో ఉందని, మలైకాతో అర్జున్ సన్నిహితంగా మెలగడం కండల వీరుడికి ఇష్టం లేదని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి.