పాపం మంచి వాళ్లకు కాస్త ఇబ్బందులు తప్పవేమో? టాలీవుడ్ లో మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న బోగవల్లి ప్రసాద్ పరిస్థితి ఇలాగే వుంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తీస్తే, లీక్ అయి, నానా బాధ పడ్డారు. మంచి డైరక్టర్ అని నమ్మి సినిమా చేతిలో పడితే, డిజాస్టర్ట్ ఇచ్చాడు సుధీర్ వర్మ. అయినా తట్టుకుని, నాన్నకు ప్రేమతో అంటూ సినిమా మొదలెడితే, ఇప్పుడు పొంగల్ రేస్ లోకి రావడానికి కిందా మీదా పడాల్సి వస్తోంది.
అయినా గుండెనిబ్బరంతో ఓ పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు, మరోపక్క కనపడని శతృవులను ఎదుర్కొంటూ మార్కెటింగ్ పనులు చక్కబెడుతుంటే, హీరో ఎన్టీఆర్ లాంటి వాళ్లు, అక్కర్లేని, అవసరం లేని, ట్వీట్ లు చేసి మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటి నుంచో సంక్రాంతికి రావాలని చెబుతూ వున్నా, ఇంకా సుకుమార్ కాస్త డిలే చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. తనకు ఇంకా ఎడిటింగ్ కు టైమ్ కావాలని, మరోకటి అని సుకుమార్ అడుగుతున్నట్లు వినికిడి. అయినా కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి, ఎలాగైనా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు.
ఇక కాదూ, తప్పదు, క్వాలిటీ కోసం ఒక వారం ఆగాల్సిందే అనుకుంటే, వెనక్కు వెళ్లక తప్పదేమో? ఏదైనా టాలీవుడ్ లో భారీ నిర్మాతల పరిస్థితి ఏం బాగా లేదు. మొన్నటికి మొన్న రుద్రమదేవి, సైజ్ జీరో, బెంగాల్ టైగర్, ఇలా చాలా సినిమాలు డేట్ల కోసం కిందా మీదా పడి, అనవసరంగా అదనపు వడ్డీల భారం భరించినవే. అంతకు మించి, ఇంతకు ముందు ఎన్టీఆర్ తో సినిమా తీసిన బండ్ల గణేష్ కూడా టెంపర్ విషయంలో కిందా మీదా పడ్డాడు. ఇదే తీరు కొనసాగితే ఇకపై ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి నిర్మాతలు ముందు వెనుక ఆడతారేమో?