ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- 17

స్టిర్లింగ్‌ నుండి వాలెస్‌ వెనక్కి మరలలేదు. ఎందుకంటే యుద్ధాల కారణంగా ఎక్కడా తిండి దొరకటం లేదు. తన సైన్యంతో సహా ఇంగ్లండుపై పడ్డాడు. మూణ్నెళ్లపాటు అతనూ, అతని మనుష్యులు ఇంగ్లండును అన్ని విధాలా దోచుకుని…

స్టిర్లింగ్‌ నుండి వాలెస్‌ వెనక్కి మరలలేదు. ఎందుకంటే యుద్ధాల కారణంగా ఎక్కడా తిండి దొరకటం లేదు. తన సైన్యంతో సహా ఇంగ్లండుపై పడ్డాడు. మూణ్నెళ్లపాటు అతనూ, అతని మనుష్యులు ఇంగ్లండును అన్ని విధాలా దోచుకుని దొరికినంత చేతబుచ్చుకుని యింటికి మరలారు. తిరిగి వచ్చి వాలెస్‌ తనను తాను స్కాట్లండ్‌ రాజు బలియోల్‌ తరఫున రాజప్రతినిథిగా ప్రకటించుకున్నాడు. సామాన్యప్రజలు దానికి సంతోషించినా సామంతరాజులు, జమీందార్లు హర్షించలేదు. అతనిపై ఈర్ష్య పెంచుకున్నారు. ఫ్లాండర్స్‌ నుంచి ఇంగ్లండుకు తిరిగి వచ్చిన ఎడ్వర్డు స్టిర్లింగ్‌ పరాజయం గురించి తెలుసుకుని వాలెస్‌కు బుద్ధి చెప్పడానికి మహాసైన్యంతో స్కాట్లండ్‌పైకి దండెత్తాడు. వాలెస్‌ వద్ద అంత సైన్యం లేదు. అందువలన ఇంగ్లీషు సైనికులకు అన్నపానీయాలు లేకుండా చేయడానికి వాళ్లు వచ్చే దారిలో వున్న వూళ్లలో పంటలు తగలబెట్టించాడు. తాము వెళ్లి  పక్కనున్న అడవుల్లో దాగున్నారు. ఎడ్వర్డ్‌ సైన్యానికి తినడానికి తిండి లేదు, పోరాడదామంటే శత్రుసైన్యం లేదు. వాలెస్‌ గెరిల్లా యుద్ధం చేసేవాడు. ఇంగ్లీషు సైనికులు ప్రమత్తంగా వున్నపుడు హఠాత్తుగా దాడి చేసి నాశనం చేసేవాడు. ముందుకు వెళుతున్న కొద్దీ ఎడ్వర్డ్‌కు వేసట పెరిగింది. వాలెస్‌ దొరకడని నిశ్చయించుకున్న ఎడ్వర్డ్‌ తిరిగి వెళ్లిపోదామని సైన్యానికి చెప్పాడు. 

ఆ దశలో వాలెస్‌ పట్ల అసూయగ్రస్తులైన యిద్దరు స్కాట్‌ జమీందార్లు ఎడ్వర్డ్‌ వద్దకు వచ్చి ''వాలెస్‌ సేన యిక్కడకు దగ్గర్లోనే ఫాల్‌కిర్క్‌ అనే వూరి దాపున అడవుల్లో దాగి వుంది.'' అని ఉప్పందించి, వాలెస్‌ ఏ విధంగా దాడి చేద్దామనుకుంటున్నాడో ఆ పథకమంతా వివరించారు. 'మీరు వెనుదిరగ్గానే రాత్రి వెనకనుంచి మీపై దాడి చేయబోతున్నాడు' అని కూడా చెప్పారు. ఇది వింటూనే ఎడ్వర్డ్‌ సైన్యాన్ని ఆ వైపు నడిపించాడు. చీకటి పడేవరకు ప్రయాణించి, తర్వాత పక్కన బల్లాలు, కత్తులు పెట్టుకుని కవచాలతోనే విశ్రమించారు. వారి మధ్య తన గుఱ్ఱం పక్కనే రాజు మామూలు సైనికుడిలా శయనించాడు. తెల్లవారుఝామున హఠాత్తుగా అందరూ వులిక్కిపడి లేచి ఆయుధాలు చేపట్టారు. 'రాజుగారు గాయపడ్డారు' అన్నారెవరో. కానీ శత్రువేడీ!? జరిగిందేమిటంటే రాజుగారి గుఱ్ఱమే రాజును తన్నింది. అతని పక్కటెముకలు విరిగాయి. ఆ గాయంతోనే రాజు గుఱ్ఱం ఎక్కి ''ఎలాగూ అందరూ లేచారు. రండి శత్రువుపై దాడికి వెళదాం'' అన్నాడు. వెళ్లి వాలెస్‌ సైన్యం వున్న చోటికి చేరారు. వాళ్లను చూస్తూనే వాలెస్‌ కంగారు పడినా చెదరలేదు. తన సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేసి 'ఇప్పుడు చూపండి మీ వీరత్వం' అన్నాడు. అయితే అప్పుడు జమీందార్లు చేసిన కుట్ర తన వికృతరూపాన్ని చూపింది. వాలెస్‌ సైన్యంలో చేరిన సామాన్యులందరూ కాల్బలంగా వున్నారు. సామంతరాజులు, జమీందార్లు తరఫున వచ్చినవారందరితో ఆశ్వికదళం ఏర్పడింది. ఎడ్వర్డ్‌ రాగానే ఆశ్వికదళమంతా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. కాల్బలమే పోరాడింది.

ఇంగ్లీషు సైనికులు విలువిద్యాప్రవీణులు. ఆ రోజు ఒక్కో ధనుర్దారి ఒక్కో బాణానికి ఒక్కో స్కాట్‌ వీరుణ్ని బలిగొన్నాడట. స్కాట్‌ ధనుర్ధారులపై ఇంగ్లీషు ఆశ్వికదళం విరుచుకుపడింది. సంఖ్యాబలంలో మిన్నగా వున్న ఇంగ్లీషు సేనను ఓడించలేమని గ్రహించిన వాలెస్‌ తన సైన్యాన్ని వెనక్కి తగ్గమని ఆజ్ఞాపించాడు. ఆ రోజు 15 వేల మంది స్కాట్‌ సైనికులు, సేనాధిపతులు మరణించారు. వారిలో వాలెస్‌కు అత్యంత ఆత్మీయుడైన జాన్‌ ద గ్రహామ్‌ కూడా వున్నాడు. అతన్ని ఫాల్‌క్రిక్‌లోనే సమాధి చేశారు. 1298 జులైలో జరిగిన యీ యుద్ధంలో రాబోయే రోజుల్లో విప్లవవీరుడుగా మారిన రాబర్ట్‌ ద బ్రూస్‌ ఇంగ్లీషు సైన్యం తరఫున పోరాడాడు. అతనికి సాటి వీరుడైన వాలెస్‌ అంటే అభిమానం వుంది. అతని వద్దకు వచ్చి ''ఎడ్వర్డ్‌ వంటి బలవంతుడైన రాజుతో పోరాడి లాభమేముంది? పోరాడి స్కాట్లండ్‌ను గెలిచినా యీ జమీందార్లు నిన్ను రాజును కానివ్వరు.'' అని వాదించాడు. ''నాకు సింహాసనం, కిరీటం ఏమీ అక్కరలేదు. నీ వంటి వారికే అవి తగును. కానీ మీకు బద్ధకం. మీది బానిసబుద్ధి. నేను నా దేశపు స్వాతంత్య్రం గురించి పోరాడుతున్నాను. మీరు సహకరించి వుంటే సాధించేవాణ్ని కూడా. మీకు మీ ఐశ్వర్యం ముఖ్యం. నాకు స్వేచ్ఛ ముఖ్యం. నేను బతికి వున్నంతకాలం దాని కోసమే శ్రమిస్తాను.'' అన్నాడు వాలెస్‌. ఇది విన్నాక బ్రూస్‌ చలించిపోయాడు. 'ఇకపై ఎడ్వర్డ్‌ పక్షాన పోరాడను' అని శపథం చేశాడు. 

వాలెస్‌కు పూర్తిగా అర్థమైంది. మత్సరంతో మగ్గిపోతున్న జమీందార్లను తృప్తి పరచాలంటే తను గవర్నరు పదవిని వదులుకోక తప్పదని. వదిలేశాడు, అలాగైనా తన స్కాట్లండ్‌లో శాంతిసౌఖ్యాలు నెలకొంటే చాలనుకున్నాడు. అతని స్థానంలో బ్రూస్‌, మరో యిద్దరు నియమితులయ్యారు. ఇంగ్లండు రాజు ఎడ్వర్డ్‌ వాలెస్‌ను వెతుకుతూ స్కాట్లండ్‌లో ముందుకు సాగాడు. ఎక్కడ చూసినా బూడిద కుప్పలే. ఇంగ్లీషు సైన్యానికి తిండి అందకూడదని స్కాట్లు తమ యిళ్లను, తమ పంటను తామే తగలబెట్టుకున్నారు. సైన్యం ఆకలిదప్పులతో అలమటిస్తోంది. విసుగు చెందిన ఎడ్వర్డ్‌ ఉత్తర స్కాట్లండ్‌ను జయించకుండానే వెనక్కి మరలాడు. వెనక్కి చేరిన కొద్ది నెలలకే తెలిసింది – దక్షిణ స్కాట్లండ్‌లో కూడా ప్రజలు తిరగబడి రక్షణగా వుంచిన ఇంగ్లీషు సైనికులను తరిమివేస్తున్నారని. మళ్లీ స్కాట్లండ్‌కి వెళ్లి అణచి వచ్చాడు. అతను వెనక్కి తిరగ్గానే మళ్లీ తిరుగుబాటు. ఇలా ఏడేళ్లలో ఐదుసార్లు జరిగింది. స్కాట్లు ఓడిపోతున్నా లొంగిపోవడానికి సిద్ధంగా లేరు. వారికి సరైన నాయకుడు వుండి వుంటే ఇంగ్లండును ఓడించి వుండేవారు. కానీ వాలెస్‌ నిరాశానిస్పృహల్లో మునిగిపోవడం వలన నాయకుడు లేకుండా పోయాడు. జమీందార్లు తనకు వొంగి దణ్ణాలు పెడుతున్నా, స్కాట్లండంతా తన సైన్యమే విస్తరించి వున్నా ఎడ్వర్డ్‌కు తృప్తి లేదు. ఎందుకంటే సామాన్య స్కాట్‌ తనకు లొంగటం లేదు. వాలెస్‌ బతికి వున్నంతకాలం వాళ్లకు అతను హీరోయే. తన అనుచరులతో అతను అడవుల్లో సంచరిస్తున్నాడు. తమకు సాయపడమని ఫ్రాన్సు రాజుకు అతను సందేశాలు పంపుతున్నాడు. రోమ్‌తో కూడా చర్చలు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అతన్ని పట్టిస్తే పెద్ద బహుమతి యిస్తారని తెలిసినా ప్రజలు పట్టివ్వడం లేదు.  

ఎట్టకేలకు ఎడ్వర్డ్‌ ప్రయత్నాలు ఫలించాయి. జాన్‌ ద మెంటియత్‌ అనే వాలెస్‌ అనుచరుడు డబ్బుకు లొంగాడు. నమ్మకస్తులైన తన అనుచరుల సాయంతో సజీవంగా పట్టి తెస్తానని ఎడ్వర్డ్‌కు మాట యిచ్చాడు. అతని మేనల్లుడు వాలెస్‌కు అంగరక్షకుడు. ఓ రాత్రి వాలెస్‌ మరొక అంగరక్షకుడితో సహా అడవిలో నిద్రిస్తూంటే ఆ మేనల్లుడు వాలెస్‌ కత్తి, బాకు, విల్లంబులు దొంగిలించి కాస్త దూరంలో భోజనం చేస్తున్న తన మామ వద్దకు వచ్చాడు. భోజనాల బల్ల మీద వున్న ఆకును తలకిందులు చేశాడు. అంతా సిద్ధం అనేదానికి సంకేతమది. (అప్పణ్నుంచి స్కాట్లెండ్‌లో మెంటియెత్‌ అనే యింటిపేరు కలవారు భోజనం చేసేటప్పుడు ఆకును తలకిందులు చేస్తే అది వాళ్ల నమ్మకద్రోహాన్ని గుర్తు చేసే అవమానంగా భావిస్తారు) మెంటియెత్‌ తన అనుచరులతో వెళ్లి వాలెస్‌పై పడ్డాడు. ఏ ఆయుధం లేని పరిస్థితుల్లో కూడా బలాఢ్యుడైన వాలెస్‌ స్టూలు ఒకటి దొరికితే దానితోనే యిద్దర్ని చంపాడు. అనేకమంది ఏకకాలంలో అతనిపై విరుచుకు పడి బంధించారు. 'మెంటియత్‌, ఏమిటిది?' అని వాలెస్‌ అడిగితే 'నిన్ను కేవలం యుద్ధఖైదీగా పరిగణిస్తారు. నీ ప్రాణానికి ముప్పు లేదు' అని మెంటియత్‌ అబద్ధపు హామీ యిచ్చాడు. వాలెస్‌ అతన్ని నమ్మాడు. పల్లెల ద్వారా, పట్టణాల ద్వారా తీసుకుని వెళితే ప్రజలు దాడి చేసి అతన్ని విడిపిస్తారని భయపడిన మెంటియత్‌ అతన్ని నిర్జన ప్రాంతాల ద్వారా తీసుకెళ్లి లండన్‌ చేర్చారు. వాలెస్‌ ఖ్యాతి ఎంతవరకు వ్యాపించిందంటే ఇంగ్లండు పౌరులు అతన్ని చూడడానికి గుంపులుగుంపులుగా వచ్చారు. వారి మధ్య నుండి వాలెస్‌ను తీసుకుని వెళ్లడం అతి కష్టమైంది. 

కొన్నాళ్లపాటు ఖైదీగానే వుంచారు. ఆ తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్‌లో విచారణ జరిపి రాజద్రోహిగా, హంతకుడిగా ఆరోపణలు చేశారు. తాను ఎడ్వర్డ్‌ను రాజుగా ఎన్నడూ అంగీకరించలేదు కాబట్టి తను రాజద్రోహి కానేరడని వాలెస్‌ చేసిన వాదనను ఎవరూ పట్టించుకోలేదు. వాలెస్‌ను తీవ్రంగా దండించి, స్వాతంత్రేచ్ఛ అనే ఆలోచనను స్కాట్‌ ప్రజల మెదళ్ల నుండి తుడిచివేయడానికి నిశ్చయించుకున్న ఎడ్వర్డ్‌ అతి భీకరంగా చంపించాడు. కానీ వాలెస్‌ స్మృతిని చెరపలేకపోయాడు. ఇప్పుడు ''బ్రేవ్‌హార్ట్‌'' సినిమా కథ తెలుసుకోదలచినవారు కింది లింక్‌ను క్లిక్‌ చేయండి.

Click Here For Brave Heart Story

(సశేషం)  (ఫోటోలు – లండన్‌లో టవర్‌ ఆఫ్‌ లండన్‌లో వాలెస్‌ను బంధించి వుంచిన ట్రైటర్స్‌ గేట్‌)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Archives