మహేష్ బాబు భరత్ అనే నేను భారీ సినిమా విడుదలకు మరో పది రోజులు వుంది. ఈ సినిమా విజయం అందరికన్నా ఎవరికి అవసరం అంటే హీరో మహేష్ బాబుకే. ఇప్పటి వరకు 23సినిమాలు చేస్తే దాదాపు 13ఫ్లాపులే. మరికొన్ని ఏవరేజ్ సినిమాలే. అయితే అంతమాత్రం చేత మహేష్ చరిష్మా ఏ రోజూ తగ్గలేదు. ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి పరమ అరివీర భయంకర ఫ్లాపులు ఇచ్చినా, మహేష్ డిమాండ్ అలాగే వుంది.
అందుకే మహేష్ కూడా ఆ మధ్య అన్నాడు.. 'ఫ్లాపులు వచ్చినప్పుడల్లా నా ఆదాయం పెరిగింది' అని. సరే, బయ్యర్లు అప్పులపాలైపోయారు. అది వేరే సంగతి.
ఇలాంటి కేరీర్ గ్రాఫ్ తో, బ్రహ్మొత్సవం, స్పైడర్ వంటి ప్లాపుల తరువాత చేస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మీద కేవలం ఆశలు పెట్టుకోవడం మాత్రమే కాదు. సకల వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నాడు మహేష్ బాబు. బ్రహ్మోత్సవం టైమ్ లో కొంత వరకు, శ్రీమంతుడు టైమ్ లో పూర్తిగా సినిమా ప్రచార వ్యవహారాల్లో ఇన్ వాల్వ్ అయిన మహేష్ సతీమణి నమ్రత మళ్లీ మరోసారి పూర్తిగా ప్రచార వ్యవహారాలను చూస్తున్నారు.
విజయం కోసం మహేష్-నమ్రత తీసుకున్న జాగ్రత్తలను పరిశీలిస్తే,.. ఇప్పటి వరకు మూడు హిట్ లు అందించిన కొరటాల శివను డైరక్టర్ గా తెచ్చుకోవడం. స్పైడర్ టైమ్ లో ఎన్టీఆర్ అభిమానులో, ఆయన సన్నిహితులో కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసారన్న భావనతో, ఓ కొత్త డిజిటల్ టీమ్ ను హైర్ చేయడం. పూర్తిగా ఆ డిజిటల్ టీమ్ మీద డిపెండ్ అయిపోయి, పబ్లిసిటీ చేయించడం.
ఎక్కడ ఎన్టీఆర్ అభిమానులు మళ్లీ నెగిటివ్ చేస్తారో అని, సినిమా ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా తెచ్చుకోవడం. అదే రోజు రాత్రి మహేష్ తన ఇంట్లో పార్టీ ఇచ్చి, దానికి మెగా హీరో రామ్ చరణ్ ను ఆహ్వానించడం. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాను ప్రశంసలలో ముంచెత్తడం.
డిజిటల్ టీమ్ ను మరింత హుషారుగా పని చేయించడం కోసం వారికి కానుకలు ఇవ్వడం. ఇలా ప్రతి విషయంలో అటు నమ్రత, ఇటు మహేష్ కేర్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా తేడావస్తే? ఎవరిని బాధ్యులను చేయాలి? డిజిటల్ టీమ్ మార్చారు. మాంచి డైరక్టర్ ను తెచ్చారు. అందరు హీరోల ఫ్యాన్స్ ను బుజ్జగించే ప్రయత్నం చేసారు.
కానీ వాస్తవానికి సినిమాకు కావాల్సింది ఇవి మాత్రమే కాదు. ఇవే కాదు. సినిమాలో కంటెంట్. రంగస్థలం సినిమాకు ఏం హడావుడి చేసారు? జస్ట్ విశాఖలో ఓ సభ చేసారు. అంతే. సినిమా ముందు డైరక్టర్ అందుబాటులో లేరు. హీరో అందుబాటులో లేరు. హీరోయిన్ లేదు. పెద్దగా మీడియా మీట్ లు లేవు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కారణం దానిలో కంటెంట్.
భరత్ అనే నేను విషయంలో కూడా కావాల్సింది ఇదే. సినిమాలో కంటెంట్ వుంటే, నమత్ర, మహేష్ ఇన్ని వ్యూహాలు పన్ననక్కరలేదు. ఇంత టెన్షన్ పడక్కరలేదు. కానీ మహేష్ సమస్య మహేష్ ది?
ఎన్ని ప్లాపులు ఇచ్చినా సూపర్ స్టార్ ఇమేజ్, ఆ బిజినెస్ రేంజ్ అన్నవి ఎన్నాళ్లు వుంటాయి. బ్రహ్మోత్సవం, స్పైడర్ రెండూ కలిసి బయ్యర్లను కుదేలు చేసాయి. భరత్ అనే నేను హిట్ అయితే సంతోషం. లేదూ అంటే, ఇక భవిష్యత్ లో బయ్యర్లు మహేష్ సినిమా అంటే భయపడతారు.
ఎందుకంటే, బ్రహ్మోత్సవం బయ్యర్లకు మహేష్ రూపాయి వెనక్కు ఇచ్చింది లేదు. నిర్మాతకు సినిమా చేస్తానని, తెలివిగా తప్పించుకున్నాడని గ్యాసిప్ లు వున్నాయి. ఇప్పుడు ఆ నిర్మాత స్టేలు పట్టుకుని రెడీగా వున్నారు తరువాత సినిమాపై. ఇక స్పైడర్ నిర్మాతకు కూడా సినిమా చేస్తానన్నారు తప్ప రూపాయి వెనక్కు ఇచ్చింది లేదు. ఇలా అయితే నిర్మాతలు రావచ్చేమో కానీ, బయ్యర్లు రాను రాను తగ్గే ప్రమాదం వుంది.
అందుకోసమే, ఈ పరిస్థితి రాకుండానే మహేష్.. నమ్రత ఇంత కిందామీదా పడుతున్నారు. ఈ సినిమా వారికి లిట్మస్ టెస్ట్.