నందమూరి వంశంపై రైట్స్ ఎవరివో ఇక డైలాగుల్లో చెబుతారా…!

ఇన్ని రోజులూ వంశ ప్రతిష్ట గురించి… వంశ చరిత్ర గురించి.. తమ గొప్పదనం గురించి.. తొడలు కొట్టి మరీ చెప్పారు నందమూరి హీరోలు. చెట్టుపేరు చెప్పుకొంటున్నారు.. అనే విమర్శలను ఏ రోజూ లెక్క చేయలేదు.…

ఇన్ని రోజులూ వంశ ప్రతిష్ట గురించి… వంశ చరిత్ర గురించి.. తమ గొప్పదనం గురించి.. తొడలు కొట్టి మరీ చెప్పారు నందమూరి హీరోలు. చెట్టుపేరు చెప్పుకొంటున్నారు.. అనే విమర్శలను ఏ రోజూ లెక్క చేయలేదు. నాన్నగారు.. బాబాయ్.. వంటి స్మరణలతో.. చరిత్రంటే మాది, వంశమంటే మాది… రాష్ట్ర రాజకీయం పుట్టింది మా ఇంట్లో… అంటూ తమ సినిమాల్లోని డైలాగులతో తమ గొప్ప దనాన్ని తామే ప్రతిధ్వనింపజేసుకున్నారు నందమూరి హీరోలు. మరి ఇప్పుడు ఆ వంశంలోని హీరోల మధ్య పోటీ తీవ్రస్థాయికే చేరింది.

ఎంత వరకూ వెళ్లిందంటే.. కొంతమంది అభిమానులు కొన్ని అడుగులు ముందుకేసి.. బాలయ్యను “నందమూరి వంశానికి ఏకైక వారసుడు'' అని పోస్టర్లలో వేయించారు! మరి ఇది చాలు.. నందమూరి  వంశంపై పేటెంట్ గురించి పోరాటం మొదలవ్వబోతోందని చెప్పడానికి. ఇన్ని రోజులూ వంశం గొప్పదనాన్ని వివరించారు.. ఇకపై ఆ వంశంపై తమకున్న రైట్స్ ఏమిటో.. ఆ వంశానికి తాము మాత్రమే వారసులెలా అవుతామో.. ఈ హీరోలే చెప్పాల్సి ఉంటుంది. ఇన్ని రోజులూ తమ డైలాగుల్లో వంశాన్ని కీర్తించిన ఈ హీరోలు.. ఇకపై వంశంలో తమకున్న వాటా ఏమిటో వివరించే అవకాశాలు లేకపోలేదు!

ఇన్ని రోజుల్లో కొన్ని సార్లైనా ఈ హీరోలు అడగకపోయినా, డైలాగు రైటర్లు, దర్శకులే.. వంశ ప్రస్తావన తీసుకొచ్చే డైలాగులు రాసి ఉంటారు! మరి అలాంటి ఉత్సాహవంతులు ఇకపై వంశంపై బాబాయ్ , అబ్బాయిల్లో ఎవరికి పూర్తి పేటెంట్ ఉంటుందనే.. అంశం గురించి కూడా డైలాగులు రాసే అవకాశాలు లేకపోలేదు. అసలే కోపతాపాల్లో కనిపిస్తున్న ఈ హీరోలు ఇదే ఆ ఆవేశంలో ఒకరిపై ఒకరు తమ తమ సినిమాల్లో డైలాగులు పేల్చుకుంటారేమో చూడాలి!