మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన ఖుష్బూ, తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా చెలామణీ అవుతోన్న ఖుష్బూ, ఇకపై సినిమాల్లో నటించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. నటనకు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని ఖుష్బూ ప్రకటించేసింది.
రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఖుష్బూ, కాంగ్రెస్ నేతగా భారతీయ జనతా పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌కి స్పెషల్ క్రేజ్ వుంది. ఎఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒకానొక కాలంలో సూపర్ హీరోయిన్. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి కూడా సినిమా రంగంతో టచ్ వుంది. శరత్‌కుమార్, విజయ్‌కాంత్.. ఇలా ఎందరో తమిళ ప్రముఖులు రాజకీయాల్లో వున్నారు.
ఖుష్బూ విషయానికొస్తే, గతంలో డీఎంకే పార్టీలో పనిచేసిన ఆమె.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి, తమిళనాడు రాష్ట్ర పార్టీ బాధ్యతలు స్వీకరించాలనే ఉద్దేశ్యంతో దూసుకుపోతుండడం గమనార్హం. ఖుష్బూపై కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆశలే పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే.. ఖుష్బూ సినిమాలకి గుడ్ బై చెప్పేసి, రాజకీయాల్లో సెటిలైపోవాలనుకుంటోందనే ప్రచారం జరుగుతోంది.