ఉత్తరాంధ్రలో పస తగ్గిన పసుపు పార్టీ

మా పార్టీ దేశంలోనే ఎన్నతగినది, క్రమశిక్షణకు ఎవరూ సాటి లేరు, పోటీ రారు అంటూ జబ్బలు చరచుకునే తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ సంస్కృతి అచ్చంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లా మొదలుకుని శ్రీకాకుళం వరకూ పార్టీలో…

మా పార్టీ దేశంలోనే ఎన్నతగినది, క్రమశిక్షణకు ఎవరూ సాటి లేరు, పోటీ రారు అంటూ జబ్బలు చరచుకునే తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ సంస్కృతి అచ్చంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లా మొదలుకుని శ్రీకాకుళం వరకూ పార్టీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటే ఏకంగా మంత్రులే కలబడడంతో పార్టీ పరువు గంగలో కలుస్తోంది. తమ మాటే నెగ్గాలన్న పంతం, అందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు చేసే ప్రయత్నం టీడీపీ ప్రతిష్టను మంట కలుపుతున్నాయి. ఈ నెల 16, 1 తేదీలలో జరిగిన తెలుగుదేశం పార్టీ సంస్ధాగత ఎన్నికలను ఓ ప్రహసనంగా చెప్పుకోవాలి. పేరుకు ప్రజాస్వామ్యం చందంగా ఈ ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్ష పదవు కోసం ఎందరో అర్హులు పోటీకి సిద్ధపడగా, అధినాయకత్వం ఆదేశాలతో వచ్చిన పరిశీలకులు ఉత్సాహవంతుల సంఖ్యను రెండుకు కుదించేశారు. ఆ ఇద్దరిలోనూ చివరికి తాము అనుకున్న వారినే నామినేట్ చేసుకుని ఎన్నికలు అయిందనిపించారు. ఇంత జరిగినా కూడా పార్టీలో కుమ్ములాటలు ఏ మాత్రం తగ్గలేదు. క్రమశిక్షణ పట్టు తప్పింది, తమ్ముళ్లు సొంత పార్టీలోని ప్రత్యర్ధులను అణచివేసేందుకు వ్యూహాలు పన్నారు, చివరికది సామాన్య జనాలకు కూడా చేరి ఔరా టీడీపీ అని ముక్కున వేలేసుకునేలా చేసింది. మొత్తం మీద తెలుగు దేశం పార్టీ మునుపటి ది కాదన్న సత్యాన్ని మాత్రం ఈ ఎన్నికలు అనే నామినేటెడ్ ఎంపికల ద్వారా మరోమారు రుజువైంది.

అయ్యన్న వర్సెస్ గంటా

విశాఖ జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు బద్ధ శత్రువులుగా ఒకే పార్టీలో కొనసాగడం విశేషం. ప్రతీ సందర్బాన్ని సొమ్ము చేసుకుని ఒకరిని ఒకరు తగ్గించాలన్న తాపత్రయం ఇద్దరిలోనూ ఉంది.  ఇదే ఇపుడు జిల్లా పార్టీకి గుదిబండగా మారింది. అర్బన్, రూరల్ రెండు అధ్యక్ష పదవులకు, ఇతర కార్యవర్గానికి జిల్లాలో నామినేట్ చేయాల్సిఉంది. అర్బన్‌కు సంబంధించినంతవరకూ మంత్రి గంటాకు సన్నిహితుడైన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు లైన్ క్లియర్ అయింది. ఆయనతో పోటీ పడిన మరో నేత రహమాన్ కూడా గంటా వర్గీయుడే. దాంతో, గంటా ఎటువంటి అభ్యంతరం లేకుండా వాసుపల్లికి ఒకే చేసేశారు. ఇక్కడ మరో మంత్రి అయ్యన్న వర్గీయుడైన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుడైన బైరెడ్డి పోతన్నరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా చేయాలనుకున్నారు. కానీ, ఆయనకు పోటీగా హర్షవర్ధన్‌ను గంటా వర్గం రంగంలోకి దింపింది. దాంతో, కార్యవర్గం మొత్తం నామినేట్ చేసే అవకాశం అధినాయకత్వానికి వెళ్లిపోయింది. అసలైన వివాదం మాత్రం రూరల్ జిల్లా అధ్యక్ష ఎన్నికలకు వచ్చిపడింది. 

మంత్రి అయ్యన్నపాత్రుడు రూరల్ జిల్లాలోని నర్శీపట్నంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, పైగా, ప్రస్తుత అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు. దాంతో, పట్టు కోసం అయ్యన్న పోరాటం చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే, రూరల్‌లో అయ్యన్నను దెబ్బకొట్టేందుకు గంటా వర్గం చేయని ప్రయత్నం లేదు. కదపని పావులు లేవు. గవిరెడ్డిని తప్పించడానికి గంటా మూడు ఆప్షన్లతో ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు.  ఆ ముగ్గురూ కూడా గంటా అతి ముఖ్య అనుచరులే కావడం విశేషం. అయితే, గంటా మనసులో వేరే పేరు ఉంది, తనకు అత్యంత ఆప్డుడైన అనకాపల్లి ఎంపి ముత్తెంశెట్టి శ్రీనివాసరావును జిల్లా అధ్యక్షున్ని చేయడం, మరో వైపు జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలను కూడా గంటా తనవైపు తిప్పుకున్నారు. దాంతో, గవిరెడ్డి పట్ల సహజంగానే వ్యతిరేకంగా ఎమ్మెల్యేలంతా స్పందించారు. దాంతో, గవిరెడ్డికి అవకాశాలు మూసుకుపోయాయి. అయినా సరే, నామినేటెడ్ పదవి కాబట్టి చంద్రబాబు వద్ద తన పలుకుబడిని నిరూపించుకునైనా గవిరెడ్డిని అధ్యక్షున్ని చేయాలన్న పట్టుదలతో అయ్యన్న ఉన్నారు. మరి, అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ, మొత్తానికి ఈ వివాదాల మూలంగా అర్బన్, రూరల్ రెండు అధ్యక్ష పదవుల నామినేటెడ్ కార్యక్రమం వాయిదా పడింది.

సిక్కోలులోనూ అదే కథ

శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.  ఇక్కడ మంత్రి కింజరపు అచ్చెంనాయుడుకు, జిల్లాలోని సీనియర్ నాయకులకు అసలు పడడంలేదు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శ్యామసుందర శివాజి జిల్లా అధ్యక్ష ఎన్నికలలో తన వర్గం కోసం గట్టిగా ప్రయత్నించారు. మరోమారు చౌదరి బాబ్జిని జిల్లా అధ్యక్షున్ని చేయడానికి అచ్చెంనాయుడు ప్రయత్నించగా దానిని శివాజీ ప్రతిఘటించారు. ఆయన వెనకాల సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. శివాజీ వర్గం నుంచి పలాసా ఎమ్మెల్యేగా ఉన్న శిరీషను అధ్యక్షురాలిగా చేయాలని ప్రతిపాదన ఉంది. ఇక్కడ ఎన్నికల పరిశీలకురాలు, ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత ఏం చేయలేక చేతులెత్తేశారు. దాంతో, అక్కడ జిల్లా అధ్యక్ష ఎన్నిక కూడా వాయిదా పడిపోయింది. ఇలా బాహాబాహాగా తలపడడంతో సిక్కోలులో అంతర్గతంగా రగులుతున్న గ్రూపులు కాస్తా బయటపడ్డాయి. ఇక్కడ నిర్ణయాన్ని కూడా అధినాయకత్వానికి వదిలేశారు. బాబు సిక్కోలులో ఎవరిని అధ్యక్ష పీఠం ఎక్కించాలన్నది నిర్ణయిస్తారన్నమాట. ఇప్పటికే సిక్కోలులో ఎర్రంనాయుడు కుటుంబం ఓ వైపు,  ప్రత్యర్ధులు మరో వైపు మోహరించి ఉన్నారు. ఇంతకాలం చాప కింద నీరులా ఉన్న పోరు ఇపుడు సంస్ధాగత ఎన్నికల పుణ్యమాని బయటపడింది. బాబుకు మంత్రి అచ్చెంనాయుడు సన్నిహితంగా ఉంటున్నారు. మరి, ఆయన మాటను మన్నించి చౌదరి బాబ్జీని కొనసాగిస్తారా. లేదా వైరి వర్గాన్ని గౌరవించి శిరీషకు పట్టం కడతారా చూడాలి. రెండూ కాదంటే తటస్ఠంగా వేరే వాళ్లను తెచ్చి అధ్యక్షున్ని చేస్తారా అన్నది చూడాల్సిఉంది. మొత్తానికి పార్టీ ఎన్నికలు కాదు కానీ సిక్కోలులో పసుపు పార్టీ గ్రూపులుగా విడిపోయింది.

రాజా వారికి జై అన్న విజయనగరం

ఎంతైనా తాను రాజేనని కేంద్ర పౌర విమానయాన మంత్రి పి అశోక్‌గజపతిరాజు నిరూపించుకున్నారు. ఆయన తన వర్గీయుడైన పార్వతీపురంకు చెందిన ద్వారపరెడ్డి జగదీష్‌ను మరోమారు విజయనగరం జిల్లా అధ్యక్షున్ని చేసేలా పావులు కదిపారు. అయితే, ద్వారపురెడ్డికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు పావులు కదిపినా రాజు గారికి ఎదురు చెప్పలేక, ఆయనను గౌరవించాలని తల వంచారు. జిల్లాకు చెందిన మంత్రి కిమిడి మృణాళిని ఉన్నా ఆమె పట్ల ఎమ్మెల్యేలలో వ్యతిరేకత ఉంది. దాంతో, ఆమె ఎవరి పేరును సిఫార్సు చేయలేక మౌనం దాల్చారు. ఇక, జిల్లాలో అశోక్‌కు ఎదురు లేకపోవడంతో ఇక్కడ ఎన్నిక మాత్రం సాఫీగానే సాగిందని చెప్పాలి. కాగా, కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, ఆ మీదట టీడీపీలో వచ్చి చేరిన నాయకులు మాత్రం  ఈ అధ్యక్ష ఎన్నికలనే నామినేటెడ్ విధానం పట్ల గుర్రుగా ఉన్నారు. కొందరు పోటీ చేయాలని ఉత్సాహపడినా అశోక్ పట్ల మర్యాదతో తప్పుకోవాల్సివచ్చింది. దాంతో, జిల్లాలో అసమ్మతి మాత్రం నెమ్మదిగా విస్తరిస్తోందన్న సంకేతాలను మాత్రం ఈ ఎన్నికలు వెలువరించాయి. ఇప్పటికైతే ప్రమాదం లేదు కానీ, విజయనగరం జిల్లాలోనూ నివురు గప్పిన నిప్పులా కుమ్ములాటలు ఉన్నాయన్నది వాస్తవం.

నామినేటెడ్ విధానంపై తమ్ముళ్ల నిరస

ఇదిలా ఉండగా, తమది అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని, క్రమం తప్పకుండా పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను నిర్వహిస్తూ ఉంటామని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ విధానం పట్ల మాత్రం తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటేనే పోటీ ఉండాలని, అటువంటిది పోటీ లేకుండా అందరినీ పక్కన పెట్టేసి ఒకరో ఒకరిని నెత్తిన రుద్దడం ఎంతవరకూ సమంజసమని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లా వరకూ వస్తే ఇక్కడ అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం పది మంది వరకూ పోటీ పడ్డారు. అలాగే, రూరల్ జిల్లా కిరీటం కోసం అర డజనుకు పైగా ఉన్నారు. అర్బన్ జిల్లాలో పోటీ చేయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం వార్డులకు పోటీ చేసే వారికి టిక్కెట్లు ఇవ్వడం, సిఫార్సులు చేయడం వంటి వాటి ద్వారా అధ్యక్షుడు కీలకంగా మారుతారు. పైగా, పార్టీ అధికారంలో ఉంది. దాంతో ఎలాగైనా అర్బన్ కిరీటం పెట్టుకోవాలని సీనియర్లతో పాటు, పలువురు కొత్తవారూ ఉత్సాహపడ్డారు. కానీ, పరిశీలకునిగా వచ్చిన సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం అధినాయకత్వం అభిమతాన్ని తమ్ముళ్లకు తెలియచేసి ఇద్దరు పేర్లను మాత్రమే రంగంలో ఉంచారు. అందులో చివరి వరకూ పోటీ పడిన సీనియర్ నేత ఎస్‌ఎ రహమాన్‌ను తప్పించి వాసుపల్లిని మరోమారు చేయడానికి హైకమాండ్ ఆలోచన చేయడంతో ఇపుడు తమ్ముళ్తంతా లోలోపల రగిలిపోతున్నారు. మొత్తం మీద టీడీపీలో ఎన్నికలు మాత్రం ఆ పార్టీలో విభేదాలకు అద్దం పట్టాయని చెప్పక తప్పదు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.