మొన్నటివరకు మహాభారతం ప్రాజెక్టు ఇద్దరి మధ్య మాత్రమే నలిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన బడా వ్యాపారవేత్త దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మహాభారతం ప్రాజెక్టు ప్రకటించాడు.
మోహన్ లాల్ లాంటి ప్రముఖులు ఇందులో నటిస్తారంటూ ప్రకటన వచ్చింది. మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అంటూ రాజమౌళి ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నాడు.
అయితే అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేనని అన్నాడు. వీళ్లిద్దరూ ఇలా మహాభారతంపై ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. కానీ కన్నడంలో మహాభారత గాథ ఆధారంగా ఓ బడా ప్రాజెక్టు ఏకంగా సెట్స్ పైకి రావడానికి రెడీ అయిపోతోంది.
కన్నడ నటుడులు దర్శన్, రవిచంద్రన్, అంబరీష్ లాంటి నటులంతా కలిసి మహాభారతాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టుకు కురుక్షేత్ర అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందులో ద్రౌపది పాత్ర కోసం నయనతారను సంప్రదించారు మేకర్స్. దర్శకుడు నాగన్న, నయనతారకు స్టోరీ వినిపించాడట.
శ్రీరామరాజ్యంలో సీతగా నటించిన నయనతార ఇప్పుడు ద్రౌపదిగా కనిపించనుందన్నమాట. అయితే ఈ ప్రాజెక్టుపై నయన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వివరాల్ని ఈనెల 23న వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. బహుశా ఆరోజు నయనతార ఈ ప్రాజెక్టులో ఉంటుందా ఉండదా అనే విషయంపై క్లారిటీ రావొచ్చు.