నయనతార, వయసు ముఫై మీద మూడు ఎక్కువే అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గని హీరోయిన్. ఆమెను సినిమాల్లోకి తీసుకోవడం ఎంత కష్టమో, ఆమెతో సినిమా ఫినిష్ చేయడం కూడా అంతే కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. లేటెస్ట్ గా తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటేమో బాలయ్య హీరోగా జై సింహా సినిమా. అది పూర్తయిపోయింది. రెండవది చిరంజీవి సైరా సినిమా. ఈ సినిమాలో నయన్ వుంటుందా? వుండదా? అన్నదాని మీదే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
నిజానికి చిరు 150వ సినిమాలోనే నయనతార చేస్తుందని అనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పడు సైరా సినిమాకు సెట్ అయింది. కానీ నయన్ తో వ్యవహారం అంత వీజీ కాదు. ఆమె ఒకటి అనుకుంటే దాన్ని నుంచి మార్చడం ఎవరి వల్లా కాదని అంటారు.
బాబు బంగారం ఫినిషింగ్ టైమ్ లో కిందా మీదా పడినా, నయనతారను హైదరాబాద్ కు రప్పించలేకపోయారు. ఆఖరికి దర్శకుడు మారుతి చెన్నయ్ వెళ్లి అక్కడే పాట షూట్ ఛేద్దామని కూడా ట్రయ్ చేసాడు. కానీ ససేమిరా అనేసింది. ఆఖరికి ఆ పాట లేకుండానే బాబు బంగారం విడుదలయింది.
నిన్నటికి నిన్న జై సింహా విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని తెలుస్తోంది. జై సింహా ఫినిష్ అవుతుంటే, ఆమెతో రెండు ఇంటర్వూలు చేయించి వుంచితే మంచిదని యూనిట్ అనుకుందట. వాటిని విడుదల టైమ్ లో ప్రచారానికి వాడుకోవచ్చుని. ఆమె కూడా ఓకె అందట. అందులో ఓ ఇంటర్వూ బాలయ్యతో కలిపి చేద్దాం అనుకున్నారట. అంతా బాగానే వుంది. రేపు ఇంటర్వూలు అనగా, ఈ రోజు ఆమె చెన్నయ్ కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దాంతో యూనిట్ అవాక్కయ్యిందట.
మరి సైరా వ్యవహారం ఎలా సెట్ అవుతుందో? చూడాలి. సైరా యూనిట్ అయితే నయనతారతో సమస్యలేవీ లేనట్లే అంటోంది. ఆ విధంగానే ట్వీట్ లు వస్తున్నాయి. కానీ నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా?