ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది టాలీవుడ్ లో. ఒకళ్లు ఓ టైపు పాత్ర చేస్తే, ఇక మిగిలిన వారంతా అదే బాట పడతారు. ఒక హీరో కొత్త గెటప్ ట్రయ్ చేస్తే మిగిలిన వారంతా అదే దోవన నడుస్తారు. ఒక హీరో గెడ్డంతో నటిస్తే, మిగిలిన వారు సై అంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ ట్రెండ్ నెగిటివ్ రోల్.
ఎన్టీఆర్ జై లవకుశలో ఓ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అది ఎలా వుంటుందో అన్నది ఇప్పటికే లీకైన టీజర్ ద్వారా బయటకు కూడా తెలిసింది. తేజ డైరక్షన్ లో హీరో రానా కూడా నెగిటివ్ టచ్ కనిపించే రాజకీయ నాయకుడి క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ టీజర్, ట్రయిలర్లు జనాలను బాగానే ఆకట్టుకున్నాయ.
14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న లై సినిమా నితిన్ కూడా కాస్త నెగిటివ్ టచ్ వున్న హీరో క్యారెక్టర్ నే పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హను రాఘవపూడి డైరక్టర్.
ఇక సంపత్ నంది డైరక్షన్ లో హీరో గోపీచంద్ చేస్తున్న రెండు పార్శ్వాల పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒకటి కాస్త నెగిటివ్ టచ్ వున్నదే కావడం విశేషం.
వైవిధ్యమైన సినిమాలు చేసే నారా రోహిత్ కూడా కథలో రాజకుమారి అనే సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. విలన్ అంటే విలన్ కాదు. సినిమాలో నారా రోహిత్ చేస్తున్న పాత్ర, సినిమాల్లో విలన్ గా నటించే హీరో పాత్ర అన్నమాట.
మొత్తం మీద హీరోలంతా విలన్ బాట పడుతున్నారు.