నేలమీదైనా.. గాల్లోనైనా ఆయన స్టయిలే అంత!

ఒకసారి సెలబ్రిటీ హోదాకు వచ్చిన తర్వాత జీవితం చాలా దుర్భరంగా తయారవుతుంది. వారు తమ ఇచ్చమొచ్చిన రీతిలో వ్యవహరించడానికి వీలుండదు. ‘ప్రైవేటుగా ఉన్నంత వరకు మీ జోలికి మేం రాం.. ఒక్కసారి పబ్లిక్‌లోకి వస్తే.…

ఒకసారి సెలబ్రిటీ హోదాకు వచ్చిన తర్వాత జీవితం చాలా దుర్భరంగా తయారవుతుంది. వారు తమ ఇచ్చమొచ్చిన రీతిలో వ్యవహరించడానికి వీలుండదు. ‘ప్రైవేటుగా ఉన్నంత వరకు మీ జోలికి మేం రాం.. ఒక్కసారి పబ్లిక్‌లోకి వస్తే. ఇక ఏమైనా అంటాం’’ అనే శ్రీశ్రీ కవితలోని మాటలు సెలబ్రిటీలకు పదేపదే వర్తిస్తాయి. ఫరెగ్జాంపుల్‌ రోడ్డు మీద వన కారును మరొకడు ఢీకొట్టేస్తే.. మనం దిగి తగాదా పడతాం. వాడినుంచి ఓ వంద రూపాయలు వసూలు చేసుకుంటాం.. అనుకుందాం. మరైతే.. అదే సెలబ్రిటీ రాంచరణ్‌ కారును ఎవరైనా గుద్దేస్తే.. దిగి తగాదా పడితే.. పరువుపోతుంది. వసూలు చేసుకునే డబ్బు కంటె.. రోడ్డు మీద హీరో తగాదా పడ్డాడనేదే పెద్ద వార్త అవుతుంది. ఒకసారి వార్తల్లోకి వచ్చాక.. అసలు రాంగ్‌సైడ్‌ ఉన్నది రాంచరణా, అవతలి వ్యక్తా అనేది ఎవ్వరికీ పట్టదు. సరిగ్గా అందుకే సెలబ్రిటీలు పబ్లిక్‌లో మెదిలేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కానీ నేలమీదే కాదు.. గాలిలోనైనా తన స్టయిలు ఒకే తీరుగా ఉంటుందని.. ఎవరితోనైనా.. తాను హాయ్‌ చెప్పినంత తేలిగ్గా తగాదాలు పెట్టేసుకోగలనని మోనార్క్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ నిరూపించారు. తాజాగా ఆయన విమానంలో ఓ తోటి ప్రయాణికుడితో గొడవ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

సినీ ఇండస్ట్రీలో ప్రకాష్‌రాజ్‌కు గొడవలకు చాలా లింకుంది. గతంలో ఆయన వివాదాలు చాలా పంచాయతీతల వరకు వచ్చాయి. మొన్నటికి మొన్న దర్శకత్వ శాఖతో వివాదం, నిన్నటికి నిన్న సంగీత దర్శకులతో వివాదం… ఇవి మాత్రమే కాదు.. విమానం ఎక్కితే తోటి ప్రయాణికుడితో కూడా వివాదం.. ఇలా.. తగాదాల విషయంలో తాను తిరుగులేని మోనార్క్‌ అని ఆయన నిరూపిస్తున్నట్లుంది. 

తమాషా ఏంటంటే.. విమానంలో ప్రకాష్‌ రాజ్‌ గొడవ పడ్డాడు అంటే.. అందరూ ప్రకాష్‌కు గొడవలే అలవాటా? అని జోకులేసుకుంటారే తప్ప.. ఎవ్వరూ అసలు తప్పు ఎవరివైపు ఉంది.. ఎవరు కరెక్టు.. అనే అంశాల జోలికి వెళ్లరు. అందుకే సెలబ్రిటీలు ఇలాంటి చిల్లర తగాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.