సినిమా పరిశ్రమకు ఆంధ్రలో అనువుగా వుండేందుకు నెల్లూరు సమీపంలో వందల ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇది టీవీ 9 అధినేత శ్రీని రాజు, సినిమా ప్రముఖుడు దగ్గుబాటి సురేష్ లు కలిసి ఈ స్టూడియో ని నిర్మిస్తారని చెప్పుకుంటున్నారు. అటు చెన్నయ్, ఇటు ఆంధ్రకు దగ్గరగా వుండేలా సినిమా పరిశ్రమను తరలించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి.
తిరుపతి సమీపంలో అయితే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నట్లు, ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది టెక్నీషియన్లు తమిళనాడు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు కాబట్టి అదే బాగుంటుందని కూడా యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే తడ దగ్గర అయితే సముద్రతీరం కూడా వుంటుంది కాబట్టి, ప్రకృతి అందాలు కూడా కలిసి వస్తాయని అక్కడ స్టూడియో నిర్మించే ఆలోచన చేస్తున్నారంటున్నారు.
కానీ ఇంతవరకు సురేష్ సంస్థ భాగస్వామ్యంలో పెద్దగా ప్రాజెక్టులు చేపట్టలేదు. పైగా ఆ సంస్థకు విశాఖలో స్టూడియో వుంది. అందువల్ల కోరి మరోసంస్థతో కలిసి, విశాఖ వదిలి మరో చోట స్టూడియో నిర్మిస్తుందా అన్నది అనుమానం. అయితే టీవీ 9 శ్రీనిరాజుకు చిత్తూరు జిల్లాలోని సెజ్ లో భాగస్వామ్యం వుందంటారు. ఆ మేరకు ఆ ప్రాంతంలో ఆయన స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుడితే చుట్టచ్చు.
ప్రస్తుతానికి గ్యాసిప్ స్టేజీలో వున్న ఈ సమాచారం కొన్నాళ్లు ఆగితే నిజమో కాదో తెలిసిపోతుంది.