బాబును కార్నర్ చేసిన ఆర్బీఐ

మొత్తానికి రుణమాఫీకి కాకున్నా, రీ షెడ్యూలింగ్ కు ఆర్బీఐ కాస్త సానుకూలంగా స్పందించింది. నిబంధనలకు అనుగుణంగా తామేమి చేయగలమో, అందుకు అనుగుణంగా మీరేం చేస్తారో చెప్పండంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇన్నాళ్లు ఆర్బీఐ నుంచి…

మొత్తానికి రుణమాఫీకి కాకున్నా, రీ షెడ్యూలింగ్ కు ఆర్బీఐ కాస్త సానుకూలంగా స్పందించింది. నిబంధనలకు అనుగుణంగా తామేమి చేయగలమో, అందుకు అనుగుణంగా మీరేం చేస్తారో చెప్పండంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇన్నాళ్లు ఆర్బీఐ నుంచి అదిగో వస్తుంది..ఇదిగో వస్తుంది..అంటూ కాలం నెట్టుకుంటూ వచ్చిన నేతలు, ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. నిజానికి రుణమాఫీ అన్నది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏమీ కాదు. డబ్బులుంటే. ఎడం చేత్తో డబ్బులిచ్చి, కుడిచేత్తో రెండు వేళ్లు ఊపేయచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర అంత సీన్ లేదు. కానీ ఎన్నికల్లో అధికార సాధన కోసం ఎన్నికల హామీని ఓ తరుపు ముక్కలా వాడేసారు. అది ఇప్పుడు పీకలకు చుట్టుకుంటోంది. 

ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆరునెలల పరిథిలో, కేవలం స్వల్పకాలిక పంటల కోసం తీసుకున్న రుణాలను మాత్రమే రీషెడ్యూల్ చేస్తారు. 

కానీ బంగారం రుణాలను పరిగణనలోకి తీసుకోరు

అదే సమయంలో 2013 ఏప్రిల్ నుంచి అదే సంవత్సరం అక్టోబర్ మధ్య కాలంలో రుణాలే పరిగణనలోకి తీసుకుంటారు. 

నిజానికి ఈ పరిథిలో రుణాలు చాలా తక్కువ వుంటాయి. ఎందుకంటే సాధారణంగా వర్షాల ఆధారంగా సాగు చేసే రైతులు ఆ కాలంలో రుణాలు తీసుకోవడం అన్నది తక్కువ. రెండు, మూడు పంటలు పండిచే రైతులు మాత్రమే స్వల్పకాలిక రుణాలు తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. రెండు మూడు పంటలు పండించే రైతులు అంటే, ఆర్థికంగా కొంతయినా వెసులుబాటు కలిగి వుంటారు. కానీ అలాకాకుండా వర్షాధారంతో ఏడాదికి ఓసారి పండించే రైతుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. 

అదే సమయంలో వరదలు, అకాల వర్షాల కారణంగా పంటలు పాడయిన ప్రాంతాలు అంటే ఎక్కువ దక్షిణ కోస్తా, ఉభయగోదావరికి అవకాశం వుంటుంది. రాయలసీమకు ఈ తరహా విపత్తులు వుండవు. కరువు మండలాల్లో సీమ ప్రాంతాలు వుండే అవకాశం వుంది. రుణ మాఫీ లేదా రీషెడ్యూలింగ్ అన్నది జరిగితే మొత్తం జరగాలి లేదంటే వదిలేయాలి కానీ, ఇలా అరకొరగా చేయడం అన్నది అధికార పార్టీకి కొత్త ఇబ్బందులు కొని తెస్తుంది. పైగా ఒక ఊరిలో ఒకరికి వర్తించి, ఇంకొకరికి వర్తించకపోవడం, ఒక ప్రాంతానికి అమలు చేసి, మరో ప్రాంతాన్ని వదిలేయాల్సి రావడం ఇవన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తాయి. 

పైగా 12శాతం వడ్డీ అంటే చిన్న విషయం కాదు. 80వేల కోట్ల మొత్తం రుణాలకు బదులు కేవలం 10 వేల కోట్లు అన్నది వెసులుబాటే కావచ్చు, కానీ, దానిపై 12శాతం వడ్డీ అంటే తక్కువేమీ కాదు. కానీ బాంకు నిబంధనలను తోసిరాజనే పరిస్థితి లేదు. లేదంటే మొత్తం కట్టండి అంటారు. అది సాధ్యం కాని పని. పోనీ 10వేల కోట్లు రీషెడ్యూలు చేసి, నోటిఫై కాని మండలాల్లో, అదే సమయంలో, అదే నిబంధనల కిందకు వచ్చే రుణాలను నేరుగా ప్రభుత్వం తీర్చేయాలన్న ఆలోచన వుంది. ఆ మొత్తం పదివేల కోట్ల కన్నా తక్కువే వున్నా, ఇప్పుడు ఖజానా నుంచి అంత మొత్తం తరలించే పరిస్థితి లేదు. మరి వాటి కోసం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కొత్తగా నోటిఫై చేస్తుందే నడుస్తుందా అంటే అనుమానమే. 

ఇలాంటి సినిమాటిక్ వ్యవహారాలు అంత సులువుగా సాధ్యం కాకపోవచ్చు. అయిదేళ్ల తరువాత ఎన్నికలు వచ్చేనాటికి జనాలకు ఏదో విణంగా నచ్చ చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు పల్లెల్లో నాయకులు తిరగడం కష్టమైపోతుంది. మరోపక్క 10 వేల కోట్లు మూడేళ్లలో 12శాతం వడ్డీతో తీర్చడం కూడా కాస్త భారమే అవుతుంది. వీటన్నింటికి మించి, రీ షెడ్యూలింగ్ కు అవకాశం లేని డ్వాక్రా రుణాలు వుండనే వున్నాయి. వాటిని నేరుగా తీర్చాల్సి వుంటుంది. అంటే అందుకు కూడా కొంత మొత్తం అవసరం. మొత్తానికి ఇవన్నీ కలిసి బాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ సంగతి ఆయనే పశ్చిమ గోదావరి పర్యటనలో స్వయంగా వెల్లడించారు. మేనిఫెస్టో హామీలను తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని. 

అధికారం కోసం అలవి కాని బరువులు తలకెత్తుకుంటే ఇలాగే వుంటుంది మరి

చాణక్య

[email protected]