తమ్ముళ్లిద్దరు హీరోలు అవ్వగా లేనిదీ.. తాను కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నా అవ్వాలి కదా? చిరు, పవన్ హీరోలు అయినపుడు నాగబాబు మామయ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు కదా? అన్నదే ఇప్పుడు అల్లు బాబి లాజికల్ పాయింట్ అన్న గుసగుస వినిపిస్తోంది ఇండస్ట్రీలో. అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి అల్లు బాబి. ఫ్యామిలీలో ఓ డిఫరెంట్ పెర్సనాలిటీ అని ఫ్యాన్స్ లో టాక్. తాను అనుకున్నదే చేస్తాడు. అనుకున్నపుడే చేస్తాడు. అంతేకాదు, తను ఎలా వుండాలనుకుంటాడో అలాగే వుంటాడు, ఎవరో ఏదో అనుకుంటారని హిపోక్రసీతో వుండడు అని పేరు.
అలాంటి అల్లు బాబి ఇప్పటికే రకరకాల ఐడియాలు, బిజినెస్ లు చేసాడు. అలాగే సినిమా నిర్మాణంలోకి కూడా రావాలని అనుకున్నాడు. వరుణ్ తేజ్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ అది ఇంకా స్టార్ట్ కావాల్సి వుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు బాబికి ఇప్పుడు నటించాలని కోరిక పుట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవలే మళ్లీ పెళ్లి చేసుకున్న అల్లు బాబి తాను కూడా సినిమాల్లో నటిస్తానని, తనకు, తన ఏజ్ కు తగిన క్యారెక్టర్ ల్లో నటించాలని వుందని తండ్రి అరవింద్ ను సతాయిస్తున్నట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. అయితే అరవింద్ ఇలాంటివాటికి దూరం. కొడుకులతో తను సినిమా తీయాలంటేనే లక్షా తొంభై ఆలోచిస్తారు ఆయన. పైవాళ్లకి రికమెండేషన్లు చేయడం లాంటి వాటికి దూరం. దాంతో ఇప్పుడు ఆయనకు ఇదో తలనొప్పిగా మారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయినా స్వంతంగా బ్రహ్మాండమైన సినిమా వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు అల్లు అరవింద్. ముగ్గురు కొడుకులు వుండి కూడా ఒక్కరు దాన్ని చూసుకునే వారులేరు. వారికి ఆ ఆలోచన వున్నట్లు లేదు. దాంతో అరవింద్ ఏం చేయలేక బన్నీవాస్ ను ట్రయిన్ చేసి, లిఫ్ట్ ఇచ్చి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. కొడుకులు అంతా యాక్టింగ్.. యాక్టింగ్ అంటే ఆయన మాత్రం పాపం, ఏం చేయగలరు?