తలాక్ బిల్లుకు వ్యతిరేకం: వైఎస్సార్సీపీ

త్రిపుల్‌ తలాక్‌ బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాజ్య సభలో మంగళవారం ఆ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము వోటు వేయబోతున్నట్లు ఆయన…

త్రిపుల్‌ తలాక్‌ బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాజ్య సభలో మంగళవారం ఆ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము వోటు వేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ (త్రిపుల్‌ తలాక్‌) బిల్లుపై మంగళవారం రాజ్య సభలో జరిగిన చర్చ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. బిల్లులో పొందుపరచిన ఆరు అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఈ బిల్లు ప్రకారం తలాక్ ప్రకటించడం కేసు పెట్టదగిన నేరం అవుతుంది. మూడేళ్ళ వరకు శిక్షార్హమైన ఈ నేరంకింద నిందితుడికి బెయిల్‌ మంజూరు మేజిస్ట్రేట్‌ విచక్షణ మేరకు జరుగుతుంది. నేర తీవ్రతను కూడా మేజిస్ట్రేటే నిర్ధారిస్తారు. తలాక్‌ ద్వారా విడాకులు పొందిన భార్యకు మనోవర్తి పొందే హక్కు ఉంటుందని, అలాగే మైనర్‌ పిల్లల కస్టడీ కోరుకునే హక్కు కూడా ఆమెకు ఉంటుందని బిల్లులో పేర్కొన్నట్లుగా విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ బిల్లును ఆరు అంశాల ప్రాతిపదికన తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విడాకులు చెల్లవని, అవి చట్టబద్దం కావని ప్రకటించిన తర్వాత ముమ్మార్లు తలాక్‌ చెప్పినంత మాత్రాన విడాకులు అయినట్లు కానప్పుడు ఆ చర్య శిక్షార్హం ఎలా అవుతుందని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. తలాక్‌ కేసు పెట్టదగిన నేరంగాను, శిక్షార్హమైన నేరంగాను బిల్లులో పేర్కొనడం అనుచితంగా ఉందని అన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారికి మూడేళ్ళ కారాగార శిక్ష అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని వాదించారు. ఇక తలాక్‌ చెప్పిన భర్తకు మూడేళ్ళ శిక్ష విధించడం ద్వారా భార్యాభర్తల మధ్య తిరిగి సయోధ్య, సర్దుబాటు కుదిర్చే అవకాశమే లేకుండా ఈ బిల్లు కట్టడి చేస్తోందని ఆయన విమర్శించారు.

మూడేళ్ళపాటు జైలు శిక్ష అనుభవించే భర్త తన భార్యకు ఏ విధంగా మనోవర్తి ఎక్కడి నుంచి తెచ్చి చెల్లిస్తాడని ప్రశ్నించారు. అనేక పేద కుటుంబాలలో భర్త ఒక్కడే ఇంటికి పెద్ద దిక్కు. అతని కష్టార్జితంతోను కుటుంబం గడవాలి. ఈ పరిస్థితుల్లో అతను జైలు పాలయితే కుటుంబం ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో పడుతుందో ఊహించాలని అన్నారు. ముస్లిం వివాహాలు సివిల్‌ ఒప్పందాల పరిధిలోకి వస్తాయి. అలాంటిది ఈ బిల్లు సివిల్‌ ఒప్పందాన్ని సైతం నేరంగా పరిగణించే పరిస్థితి కల్పిస్తోంది.

ఐపీసీ 498-ఏ గృహహింస చట్టాల్లో మహిళలకు తగినంత రక్షణ కల్పించే అంశాలు ఉన్నందున కొత్తగా ఈ బిల్లులో క్రిమినల్‌ చర్యలు ప్రతిపాదించాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. త్రిపుల్‌ తలాక్‌ అనేది సామాజిక దురాచారం. కానీ దానిని నేరంగా పరిగణించడం ద్వారా సమస్యను పరిష్కరించలేమని ఆయన అన్నారు. కాబట్టి ఈ అంశాలను న్యాయశాఖ మంత్రి పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేస్తామని కూడా ఆయన సభలో ప్రకటించారు.

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!