ఆ ముద్దు సీన్లు.. మంచి సందేశాన్ని ఇస్తున్నాయట!

23 ముద్దు సీన్లు ఉన్న ఒక సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఎలా ఇచ్చింది? అది కూడా సంస్కారీ నిహ్లానీ చైర్మన్ గా ఉన్న సీబీఎఫ్సీ ఇలా వ్యవహరించడం ఏమిటి? అంటూ.. జాతీయ…

23 ముద్దు సీన్లు ఉన్న ఒక సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఎలా ఇచ్చింది? అది కూడా సంస్కారీ నిహ్లానీ చైర్మన్ గా ఉన్న సీబీఎఫ్సీ ఇలా వ్యవహరించడం ఏమిటి? అంటూ.. జాతీయ చానళ్లు ఏకంగా చర్చా కార్యక్రమాలే నిర్వహిస్తున్నాయి. యశ్ రాజ్ వారి ‘భేఫికర్’ సినిమా సెన్సార్ రిపోర్టు పై ఈ చర్చ కొనసాగుతోంది.

ఇప్పటికే ముద్దు సీన్లతో కూడిన లుక్స్ తో హీటెక్కించిన ఈ సినిమా సెన్సార్  రిపోర్ట్ పై ఆశ్చర్యాలే వ్యక్తం అవుతున్నాయి. ఇది వరకూ పలు సినిమాల్లో సెన్సార్ తీవ్ర వివాదాస్పద దశ వరకూ వెళ్లిన నేపథ్యంలో ఆ వివాదాల్లో సీబీఎఫ్సీ చైర్మన్ నిహ్లానీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన తీరు గురించే చర్చ జరుగుతోంది!

గతం లో ఒక మూవీ మేకర్ గా ఉండి.. తన సినిమాల్లో విచ్చల విడిగా శృంగార సీన్లను పెట్టిన ఘనుడు నిహ్లానీ. అయితే బీజేపీ మద్దతుదారుగా ఉంటూ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టు పొంది.. హిందూ, భారతీయ సంస్కృతీ విలువలు అంటూ మాట్లాడారీయన.

ఆ మధ్య జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ లో ముద్దు సీన్లను సెన్సార్ చేయించడం ద్వారా తొలి సారి నిహ్లానీ సంస్కారీ రూపంపై చర్చ జరిగింది. ఇక ‘ఉడ్తాపంజాబ్’ విషయంలో సెన్సార్ తీరు పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. బీజేపీ పాలనా భాగస్వామిగా ఉన్న పంజాబ్ లో అసలు విషయాల గురించి చర్చను నిహ్లానీ వంటి వారు ఇష్టపడలేదు. ఆ సినిమాను ముప్పు తిప్పలు పెట్టారు.

ఇక ‘భేఫికర్’ విషయంలో మాత్రం భేఫికర్ గా వ్యవహరిస్తూ.. ముద్దు సీన్లను యధేచ్ఛగా వదిలేసి, దానికి యూ/ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అదేమంటే..  ఇప్పుడు కొత్త రీజన్లు చెబుతున్నాడట నిహ్లానీ. ‘క్వింట్’ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ‘ఆ ముద్దు సీన్లు అర్థవంతంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమా భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు. పారిస్ లో ఉన్న యువతీయువకుల తీరు ను ఆవిష్కరించారిందులో.. విదేశాల్లో భారతీయుల ప్రవర్తనకు సంబంధించిన సన్నివేశాలు అవి..’ అంటూ నిహ్లానీ  తమ సెన్సార్ ను సమర్థించుకున్నట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు.

మరి.. ‘బేఫికర్’ భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే సినిమా కాదంటున్నారు.. బాగుంది. అలాంటప్పుడు ‘జేమ్స్ బాండ్’ లో ముద్దు సీన్లను ఎందుకు కట్ చేసినట్టు? జేమ్స్ బాండ్ ఏమైనా ఇండియన్ పోలీసా? ఆ సినిమాలో ఏమైనా భారతీయ ఆత్మ ఉందా? అలాగే భేఫికర్ ముద్దు సీన్లను పారిస్ లో ఓపెన్ ప్లేస్ లో షూట్ చేశారు, ఆ శృంగార సన్నివేశాలు విదేశంలో ఉన్న భారతీయ యువతీయువకులవి.. అంటూ నిహ్లానీ మాట్లాడటం కూడా చోద్యంగా ఉంది! విదేశాలకు పోతే.. అలా బరి తెగించేస్తారని ఈయన చెబుతున్నాడు కాబోలు! ఏదేమైనా.. వీళ్లు నంది అంటే నంది. పంది అంటే పంది!