ఇంగ్లాండ్ – భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం విదితమే. రెండో టెస్ట్‌కి విశాఖ వేదికయ్యింది. ఈ వేదికపై ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా టెస్ట్ మ్యాచ్ నిర్వహణను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీసుకుంది. సెలక్టర్స్ కమిటీ ఛైర్మన్‌గా మన తెలుగువాడు, ఎంఎస్‌కె ప్రసాద్ ఇటీవల ఎంపిక కావడం, ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో గతంలో కీలక బాధ్యతలు నిర్వహించడం తెల్సిన విషయాలే.
ఇక, మ్యాచ్ విజయం విషయానికి వస్తే, వాస్తవానికి మ్యాచ్ మూడో రోజే ముగిసిపోవాల్సి వుంది. ఇంగ్లాండ్‌ని ఫాలో ఆన్ ఆడించకుండా, టీమిండియా బరిలోకి దిగింది. లేదంటే టీమిండియాకి ఇన్నింగ్స్ విజయం దక్కి వుండేదే. ఎలాగైతేనేం, విశాఖలో క్రికెట్ అభిమానులకు ఐదు రోజుల పండగ బోల్డంత సంతోషాన్నిచ్చిందన్నది నిర్వివాదాంశం.
మ్యాచ్ చివర్లో రెండు వికెట్లు.. అత్యంత నాటకీయంగా పడ్డాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బ్రాడ్ ఎల్బీడబ్ల్యుగా ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటిస్తే, రివ్యూకి వెళ్ళాడు బ్రాడ్. కానీ, రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. చివరి వికెట్ అండర్సన్‌ది. బౌలర్ జయంత్ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశాడు, అంపైర్ లైట్ తీసుకున్నాడు. దాంతో, జయంత్ రివ్యూ కోరాడు. రివ్యూలో ఔట్ అని తేలింది. చివరి రెండు వికెట్లు – రెండు రివ్యూలు – రెండూ టీమిండియాకే అనుకూలం.. అదీ ఒకే బౌలర్‌కి సంబంధించి కావడం విశేషం.
విశాఖ మైదానం పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలం అనుకోవడానికి వీల్లేదు.. ఫాస్ట్ బౌలర్లకీ వికెట్లు బాగానే పడ్డాయి. దాంతో, మ్యాచ్‌ని అభిమానులు మేగ్జిమమ్ ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 50వది. తనకు అచ్చి వచ్చిన మైదానంలో 50వ టెస్ట్‌ని, అదీ కెప్టెన్ హోదాలో కైవసం చేసుకోవడం వెరీ వెరీ స్పెషల్ అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 455 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 204 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులు చేసి, టీమిండియా విజయానికి పునాది వేసిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ని గెలుచుకున్నాడు.