హీరో నిఖిల్ సోషల్ నెట్ వర్క్ లో చాలా యాక్టివ్ గా వుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో మరీనూ. కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా, క్రీడలు, రాజకీయాల గురించి కూడా ట్వీట్ లు చేస్తుంటారు.
అలాంటిది ఇప్పుడు వున్నట్లుండి ఏపికి స్పెషల్ స్టేటస్ మీద నిఖిల్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ఎవరైనా సరే నీకెందుకు? అని ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు కానీ, ఇటీవల ఆంధ్రలో నలుమూలల తిరిగిన తరువాత ప్రజల ఆకాంక్షను గమనించానని, అలాగే ఆంధ్రకు కేంద్రం చాలా చేయూత ఇవ్వాల్సిన అవసరం గుర్తించానని ట్వీట్ చేసారు.
దాంతో తీగ కదిలింది. డొంకా కదిలింది. వేలాది లైకులు, రీట్వీటులు, వందలాది కామెంట్లు వెల్లువెత్తాయి. దీనిపై మళ్లీ నిఖిల్ ట్వీట్ చేస్తూ, చాలా మంది పోరాటం గురించి ప్రస్తావిస్తున్నారని, పోరాటం ఒక్కటే మార్గం కాదని, ప్రజల చేతుల్లోనే ఓటు అనే ఆయుధం వుందని, 2019లో ఎంతో దూరంలో లేదు. అధికారంలో వున్నవారు అది గమనించాలి. అని అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేసారు. దీనికి మళ్లీ వేలాది లైకులు, రీ ట్వీటులు, రిప్లై లు వెల్లువెత్తాయి.
అయితే కొందరు ఏమని సందేహం వెలిబుచ్చుతున్నారు అంటే, జనాలు 2019లో ఓటును వాడి ఎవరికి బుద్ది చెప్పాలి? ఆంధ్రలో భాజపా పవర్ లో లేదు. భాజపాకు ఓటుతో బుద్ది చెప్పాలన్నా, పోటీ చేసేది చాలా తక్కువ స్థానాల్లో. ఇక పవర్ లో వున్నది తెలుగుదేశమే. కొంతమంది తమ సమాధానాల్లో, కామెంట్లలో తెలుగుదేశానికి బుద్ది చెప్పడానికి ఓటును వాడాలని, మరి కొంతమంది అలా చేస్తే, ఆంధ్ర మరింత చీకట్లోకి జారుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.
ఇంకొంత మంది మరి కాస్త ముందుకు వెళ్లి, ఆంధ్ర నటులకు తమ స్వంత రాష్ట్రం పట్టకపోయినా, తెలంగాణకు చెందిన నిఖిల్ కు పట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా మొత్తం మీద నిఖిల్ ట్విట్టర్ లో స్పెషల్ స్టేటస్ ను కాస్త గట్టిగానే కెలికినట్ల కనిపిస్తోంది.