బడ్జెట్ ప్రభావం ప్రారంభమైంది. కేంద్రం ప్రతిపాదించిన దిగుమతి సుంకం పెంపు భారం ఐఫోన్లపై పడింది. తమ ఉత్పత్తుల ధరలు పెంచబోతున్నట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ ఎస్ఈ మినహా మిగతా అన్ని మోడల్స్ ధరల్ని 3శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. నిన్నట్నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15నుంచి 20శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఐఫోన్ ధరల్ని సవరించింది ఆపిల్ సంస్థ. తాజా పెంపుతో ఇప్పటివరకు లక్షా 5వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్-ఎక్స్ మోడల్ ధర ఇప్పుడు మరింత పెరిగి, లక్షా 8వేల9వందల రూపాయలకు చేరింది.
ఇక ఇండియాలో బాగా పాపులర్ అయిన ఐఫోన్-6ఎస్ రేటు 1350రూపాయల మేర పెరిగింది. ఈ మేరకు ఎస్ఈ మినహా మిగతా అన్ని మోడల్స్ సవరించిన ధరల్ని ఆపిల్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. భారత్ లోనే తయారీ అనే కాన్సెప్ట్ ను మరింత ప్రోత్సహించేందుకు ఇలా దిగుమతి సుంకాన్ని పెంచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పెంపు వరుసగా ఇది రెండోసారి.
తాజా పెంపు నిర్ణయ ప్రభావం ఐఫోన్ పైనే ఎక్కువ. శాంసంగ్, జియోమీ, వివో లాంటి సంస్థల ఉత్పత్తులపై ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇవి తమ అసెంబ్లింగ్ యూనిట్లను భారత్ లోనే నెలకొల్పాయి. ఇక్కడ మొబైల్స్ ను తయారుచేయకపోయినా, విడిభాగాల్ని అనుసంధానించే ప్లాంట్స్ ను ఏర్పాటుచేశాయి. వాటిపై దిగుమతి సుంకం ప్రభావం లేదు.