వక్కంతం వంశీ. ఎలా కిట్టించినా, ఏం చేసినా, టాలీవుడ్ లో మాంచి కమర్షియల్ కథకుడిగా స్ధిరపడ్డారు. ఆ తరువాత డైరక్టర్ గా మారడంతోనే వచ్చింది సమస్య.
వజ్రం సినిమాను అటు ఇటు మార్చినట్లుండే సబ్జెక్ట్ తో ‘నా పేరు సూర్య’ సినిమా తీసి, దారుణమైన, భయంకరమైన పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అప్పటి నుంచీ అజ్ఙాతవాసం తప్పలేదు. ఆఖరికి నితిన్ తో సినిమా సెట్ అయింది. కథ, దర్శకత్వం రెండూ. ఇది సెట్ అయి రెండేళ్లు కావస్తోంది. మొదలై చాలా అంటే చాలా నెలలు దాటుతోంది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వున్నట్లు వుంది పరిస్థితి.
హీరో నితిన్, దర్శకుడు వక్కంతం వంశీకి ఎక్కడో సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే షూటింగ్ రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు పడుతోందని టాక్. ఈ కథ మీద ఎప్పటి నుంచో కసరత్తు చేస్తూ వస్తున్నారు వక్కంతం. ఆయనకు సరిపోక, ఓ టీమ్ ను కూడా పెట్టుకుని, అక్కడి నుంచి ఐడియాలు తీసుకుని కుస్తీ పట్టారు. తరువాత ఏకంగా నితిన్ ఆఫీస్ లోనే కథ మీద కసరత్తు ప్రారంభించారు.
మొత్తానికి షూటింగ్ మొదలైంది అనిపించారు. కానీ ఇప్పటికీ కథ మీదనో, టేకింగ్ మీదనో హీరో నితిన్ అసంతృప్తిగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ ఆగింది. ఈ నెల మూడో వారంలో మళ్లీ మొదలవుతుందని వినిపిస్తోంది. ఇదిలా వుంటే వెంకీ కుడుమల సినిమా కొంత షూట్ జరిగింది. అదీ, ఇదీ సమాంతరంగా చేయాలన్నది హీరో నితిన్ ప్లాన్.