బ్రో సినిమా నైజాం హక్కులు ఇంకా తెగడం లేదు. ఈ సినిమాకు నైజాంలో జి ఎస్ టీ తో కలిపి 35 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కావాలని నిర్మాతలు పట్టుదలగా వున్నారు.
అంటే జిఎస్టీ కాకుండా దాదాపు 29 కోట్లు అన్నమాట. అంటే భీమ్లా నాయక్ కన్నా రెండు కోట్లు ఎక్కువనే చెప్పుకోవాలి. ఇదే రిస్క్ అవుతుందని ఏస్ బయ్యర్ దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో బేరం అక్కడ ఆగింది. సినిమా విడుదల ఇంకా మూడు వారాల దూరం లో వుంది. అందువల్ల తొందర పడడం లేేదు.
పవన్ సినిమా రేంజ్ నిజానికి నైజాంలో ఎందుకో పెరగడం లేదు. సరైన మాస్ కమర్షియల్ సినిమా పడకపోవడం వల్ల కావచ్చు. మిగిలిన హీరోల సినిమాల రేట్లు మాత్రం బాగా పెరిగిపోయాయి. మహేష్ గుంటూరు కారం సినిమా నైజాం 45 కోట్లకు ఇచ్చారు. మిగిలిన హీరోల పాన్ ఇండియా సినిమాలు అయితే రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
దిల్ రాజు ముందుకు రాకపోతే మైత్రీ మూవీస్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు పెట్టడం తప్ప మరో మార్గం వుండకపోవచ్చు. పైగా ఇదే నిర్మాతలు పంపిణీ చేసిన ఆదిపురుష్ ను మైత్రీ మూవీస్ నే టేకప్ చేసింది. బ్రో సినిమా ఆంధ్ర హక్కులు మాత్రం మంచి రేటుకే మార్కెట్ చేసారు. 40 కోట్ల రేషియోలో విక్రయించారు.
ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని. కానీ స్క్రిప్ట్, మాటలు, ప్రాజెక్ట్ సెట్ చేసింది అంతా త్రివిక్రమ్ నే. ఈ సినిమాకు త్రివిక్రమ్ నే 15 కోట్ల రెమ్యూనిరేషన్, పావలా వాటా తీసుకున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.