సినీ జనాలకు క్యాన్సర్ స్క్రీనింగ్

మెగాస్టార్ చిరంజీవి సినిమా కార్మికులు, జర్నలిస్టులు కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. …

మెగాస్టార్ చిరంజీవి సినిమా కార్మికులు, జర్నలిస్టులు కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. 

సినీ పరిశ్రమ కార్మికులు, నటులు, సహా సినీజర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రఖ్యాత స్టార్ హాస్పిటల్ భాగస్వామ్యంతో వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అందిస్తోంది. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఇంతకుముందే చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం జూలై 9న హైదరాబాద్ లో దిగ్విజయం అయింది. తదుపరి జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని ఏర్పాటు చేసారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.

మెగా సోదరుడు నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారని రిజిస్టర్ చేసుకోని వారు కూడా చాలా మంది వస్తున్నారని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు. ఇలా ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే అవకాశం లేకుండా ఉంటుందని ఆయన అన్నారు.  

హైదరాబాదులో జరిగిన తర్వాత కరీంనగర్ తో మొదలుపెట్టి సుమారు 20 ప్రాంతాలలో ఇదే విధమైన పరీక్షలు చేయబోతున్నారని అలా పరీక్షలు చేసిన అన్ని పరీక్షలు నెగిటివ్ రావాలని తాను కోరుకుంటున్నాను అని అన్నారు. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగితే చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని ఆయన అన్నారు.

స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ క్యాన్సర్ అనే కాదు ఎలాంటి జబ్బు అయినా ముందే కనుక్కుంటే దాన్ని త్వరగా తగ్గించే అవకాశం ఉంటుందని జబ్బు వచ్చాక మందులు వాడటం కంటే జబ్బు వచ్చే సూచనలు కనిపించినప్పుడు దాన్ని నివారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమాలను డిజైన్ చేసింది ముందుగానే క్యాన్సర్ లక్షణాలు ఏవైనా కనిపించినా అనుమానం ఉన్నా ట్రేస్ చేసి దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్లడం కోసం అని అన్నారు. మీడియా కూడా ఈ విషయానికి విస్తృత ప్రాచుర్యం కల్పించి ప్రజల్లో దీనిమీద అవగాహన తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.