భీమునిపట్నం అందమైన ప్రాంతం. అక్కడకు వెళ్తే ఎవరైనా తిరిగి వెళ్లబుద్ధి కాదు. రాజకీయంగా కూడా కూలెస్ట్ ప్లేస్. అలాంటి భీమిలీ లో ఇపుడు హాట్ హాట్ పాలిటిక్స్ చోటు చేసుకోబోతోంది. పక్కా లోకల్ కావాలని అక్కడ రాజకీయ పక్షాల నుంచి డిమాండ్ వస్తోంది.
తమ ఎమ్మెల్యే భీమిలీ గడ్డ మీద పుట్టిన వారు కావాలని, వారికే అభ్యర్ధిగా అవకాశం ఇవ్వాలని అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు ఈ సెగ గట్టిగానే తగులుతోంది.
తాజాగా పద్మనాభం మండలంలో ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు సమావేశం అయి ఈసారి లోకల్ కే వైసీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో అధినాయకత్వం ఆలోచన చేయాలని విన్నవించుకుంటున్నారు. 2009లో అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం ద్వారా భీమిలీ నుంచి ఎమ్మెల్యే అయ్యారని, 2014 నాటికి ఆయన తెలుగుదేశంలో చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా వెళ్ళారని, 2019లో తిరిగి భీమిలీ వచ్చి వైసీపీ నుంచి గెలిచారని, మంత్రి అయ్యారని గుర్తు చేస్తున్నారు.
పదవులు వచ్చినా అవంతి భీమిలీకి ఏమీ మేలు చేయలేదని వారు విమర్శిస్తున్నారు. లోకల్ గా ఉండే సమస్యలు తీర్చాలంటే స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తెలుగుదేశంలోనూ అదే నినాదంగా ఉంది. ఆ పార్టీ టికెట్ కోసం నియోజకవర్గంలో కొందరు కీలక నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే బాలయ్య అల్లుడు భీమిలీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నారు. అలాగే ఒక మాజీ మంత్రి కూడా భీమిలీ నుంచే పోటీ అంటున్నారు. దాంతో లోకల్ నినాదం టీడీపీలో కూడా వస్తోంది. అధినాయకత్వాలు దీని మీద ఏమి ఆలోచిస్తాయో.