రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. హీరో ధనుష్ నుంచి విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా కొనసాగుతున్నారు ఐశ్వర్య. ఓవైపు పిల్లల్ని చూసుకుంటూనే, మరోవైపు ఓ మూవీని డైరక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఉన్నఫలంగా ఐశ్వర్యపై ఇలాంటి పుకార్లు రావడానికి ఓ కారణం ఉంది. ఈమధ్య కోలీవుడ్ కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించింది. రిసార్ట్ లో అతడితో ఆమె కనిపించడంతో ఈ రెండో పెళ్లి పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి.
ధనుష్ ను ప్రేమించి పెళ్లాడింది ఐశ్వర్య. స్టార్ కపుల్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా వీళ్ల సంసారం సాగింది. ఒక టైమ్ లో ధనుష్ పై 'సుచిలీక్స్' ఆరోపణలు వచ్చాయి. ఆ టైమ్ లో కూడా భర్తకు అండగా నిలిచింది ఐశ్వర్య. ధనుష్ తండ్రి ఎవరనే లీగర్ అంశం ఎదురైనప్పుడు కూడా ఐశ్వర్య చలించలేదు.
ఇలా ధనుష్ కు అన్ని విధాలుగా చేదుడువాదోడుగా ఉంటూ వచ్చింది ఐశ్వర్య. దాదాపు 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన ఈ జంట వైవాహిక ప్రయాణంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చి పడింది.
కారణం ఏంటనేది బయటకు తెలియదు కానీ, తామిద్దరం విడిపోతున్నట్టు ధనుష్-ఐశ్వర్య ఇద్దరూ సడెన్ గా ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు.
ఈమధ్య ధనుష్-ఐశ్వర్యపై మరో పుకారు కూడా వచ్చింది. అధికారికంగా విడిపోయిన వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తున్నారని, స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగి కూతురు-అల్లుడు మధ్య సయోధ్య కుదిర్చారని కథనాలు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆ తర్వాత తేలింది. ఇప్పడు తాజాగా ఐశ్వర్య రెండో పెళ్లి అంశం తెరపైకొచ్చింది.