వరుసగా రెండు హిట్లతో నితిన్ రేంజు పెరిగిపోయింది. ఏకంగా పూరి జగన్నాథ్ అంతటి దర్శకుడే దిగివచ్చి నితిన్ తో సినిమా చేశాడంటే నితిన్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు హార్ట్ ఎటాక్ వసూళ్లు కూడా ఓ మాదిరిగా బాగానే ఉన్నాయి. ఈ సినిమా క్రమేపీ హిట్ జాబితాలో చేరే అవకాశం వుంది.
ఇప్పుడు నితిన్ అసలు గేమ్ స్టార్ట్ చేశాడు. వరుసగా పది ఫ్లాపులతో… నిర్మాతల్ని కంగారు పెట్టిన నితిన్ రెండు హిట్లతో టాప్ పొజిషన్‌కి చేరాడు. ఇప్పుడు నితిన్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. అందుకే తెలివిగా తన పారితోషికాన్ని సెట్ చేసుకొంటున్నాడు నితిన్. ఈ యువ హీరో తన పారితోషికం బదులుగా నైజాం హక్కుల్ని అడుగుతున్నాడట.
నితిన్ తెలంగాణ బిడ్డ. చేతిలో విజయాలు ఉన్న ఏకైక తెలంగాణ హీరో. దానికి తోడు నైజాంలో నితిన్ సినిమాకి భారీ వసూళ్లు అందుతున్నాయి. అందుకే నైజాం రైట్స్‌ని తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నాడట. అక్కడ ఓ సినిమా సూపర్ హిట్టయితే కనీసం అయిదు నుంచి ఎనిమిది కోట్లు వసూలు చేయడం ఖాయం. పైగా స్వంత పంపిణీ వ్యవహారం వుండనే వుంది. అంటే నితిన్ రేటు అదన్నమాట..!