మనోడే మైక్రోసాఫ్ట్‌ సీఈఓ

అవును, అతను మనోడే.. మన తెలుగోడే.. అభివృద్ధిలో అత్యంత దారుణంగా వెనకబడిపోయిన అనంతపురం జిల్లాకు చెందిన ఓ తెలుగోడు, ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అగ్రగామి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కి సీఈఓగా ఎంపికయ్యాడు. ఈ వార్త…

అవును, అతను మనోడే.. మన తెలుగోడే.. అభివృద్ధిలో అత్యంత దారుణంగా వెనకబడిపోయిన అనంతపురం జిల్లాకు చెందిన ఓ తెలుగోడు, ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అగ్రగామి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కి సీఈఓగా ఎంపికయ్యాడు. ఈ వార్త తెలిసి తెలుగు జాతి పులకించిపోయింది.

1992 నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తోన్న సత్య నాదెళ్ళ ఈ రోజు మైక్రోసాఫ్ట్‌లో అతి కీలకమైన సీఈఓ పదవిని చేపట్టారు. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా పనిచేస్తోన్న బిల్‌ గేట్స్‌ తన పదవికి రాజీనామా చేశారు. బిల్‌ గేట్స్‌ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ సంస్థకు సాంకేతిక సలహాదారుగా కొత్త బాధ్యతలు చేపట్టారు.

మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్‌ ఓఎస్‌ రూపకర్త అయిన సత్య నాదెళ్ళ సీఈఓగా బాధ్యతలు చేపట్టడంపై మైక్రోసాఫ్ట్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో తమ సంస్థ మరిన్ని సంచలనాల్ని సత్య నాదెళ్ళ నేతృత్వంలో సృష్టిస్తుందని మైక్రోసాఫ్ట్‌ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటిదాకా బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బామర్‌లు సీఈఓలుగా పనిచేశారు. ఆ పదవి చేపట్టిన మూడో వ్యక్తి మన తెలుగోడు సత్య నాదెళ్ళ కావడం గొప్ప విషయం.

హైద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన సత్య నాదెళ్ళ, మంగుళూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. అనంతరం ఆయన చికాగోలో ఎంబీఏ చేశారు.