రవితేజ నటించిన కొత్త సినిమా 'నేల టిక్కెట్టు' వచ్చే శుక్రవారమే రిలీజ్ అవుతోంది. అయితే ఈ చిత్రంపై ఇంతవరకు ఎలాంటి బజ్ లేదు. క్రేజ్ తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. టీజర్, ట్రెయిలర్ రెండూ కూడా చాలా సాధారణంగా వుండడంతో ఎటువంటి ప్రత్యేక ఆసక్తి ఏర్పడలేదు.
టైటిల్ దగ్గర్నుంచి డైలాగుల వరకు ఫక్తు రవితేజ మార్కు రొటీన్‌గానే అనిపిస్తూ వుండడంతో దీనిని సినీ ప్రియులు పట్టించుకోవడం లేదు. రవితేజ గత చిత్రం 'టచ్ చేసి చూడు' ఎప్పుడు వచ్చి, ఎప్పుడు పోయిందో కూడా గుర్తు లేకపోవడం కూడా 'నేల టిక్కెట్టు'ని ప్రభావితం చేస్తోంది.
వరుసగా రెండు హిట్ సినిమాలని అందించిన కళ్యాణ్‌కృష్ణకి ఇంతవరకు ప్రేక్షకుల్లో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపేమీ రాలేదు. 'సోగ్గాగే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' రెండూ నాగార్జున చిత్రాలుగానే ముద్ర పడ్డాయి తప్ప దర్శకుడికి ఐడెంటిటీ తెచ్చి పెట్టలేదు. ప్రమోషన్స్ పరంగా కూడా ఇన్నోవేషన్ లేకపోవడంతో ఈ చిత్రానికి ఆకర్షణ కొరవడింది. దానికితోడు ఆడియో కూడా మెప్పించలేకపోవడం మరో మైనస్‌గా మారింది.