‘ఎన్టీఆర్‌’ రూపు రేఖలు మారుతున్నాయ్‌!

'మహానటి' విడుదలకి ముందే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ కూడా లాంఛ్‌ అయింది కానీ బాలకృష్ణ, తేజ మధ్య సమన్వయం కుదరక ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ చిత్రాన్ని ఎలా మలచాలనే దానిపై బాలకృష్ణకో ఐడియా వుంది.…

'మహానటి' విడుదలకి ముందే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ కూడా లాంఛ్‌ అయింది కానీ బాలకృష్ణ, తేజ మధ్య సమన్వయం కుదరక ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ చిత్రాన్ని ఎలా మలచాలనే దానిపై బాలకృష్ణకో ఐడియా వుంది. అయితే దర్శకుడి విజన్‌తో అది మ్యాచ్‌ అవకపోవడంతోనే తేజ బయటకి వెళ్లాల్సి వచ్చిందని ప్రచారంలో వుంది.

తేజ వెళ్లిపోవడంతో ఈ చిత్రం ఎవరి చేతిలోకి వెళుతుందనేది ఆసక్తిగా మారిన తరుణంలో బాలయ్యే దర్శకత్వం చేపట్టే అవకాశం లేకపోలేదనీ వినిపించింది. తర్వాత ఈ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టే ఆలోచన కూడా జరుగుతోందనీ వార్తల్లోకి వచ్చింది.

మహానటి చిత్రానికి వస్తోన్న ఆదరణ చూసిన తర్వాత 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ని అంతకంటే ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఘనంగా తెరకెక్కించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని క్రిష్‌ చేతిలో పెట్టడం సముచితమని బాలకృష్ణ భావిస్తున్నారట. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మణికర్నిక చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న క్రిష్‌ అయితే 'ఎన్టీఆర్‌' కథని ప్రభావవంతంగా, వైభవంగా రూపొందిస్తాడనే నమ్మకంతో అతడిని సంప్రదించారట.

క్రిష్‌ కూడా అందుకు సరేనన్నాడని, అయితే మణికర్నిక పూర్తి చేసిన తర్వాత 'ఎన్టీఆర్‌' కథని ఏ విధంగా చెబితే రక్తి కడుతుందనే దానిపై ఆలోచించి ఇప్పుడున్న స్క్రీన్‌ప్లే మార్చి తనదైన శైలిలో కొత్త మార్పులు చేస్తాడట.

ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది కనుక 'ఎన్టీఆర్‌' కథని తెరపై చూడాలని ఆరాటపడుతోన్న అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదన్నమాట.