అజ్ఞాతం నుంచి బయటకు రండి బాబులు

సినిమా విడుదలకు ముందు ఎలాగూ ప్రచారం చేయలేదు.  ఫ్లాప్ టాక్ వచ్చి మునిగిపోతున్న ఈ సమయంలోనైనా బయటకు రాకపోతే ఎలా? అజ్ఞాతవాసి సినిమాను కోట్లు పెట్టి కొన్న బయ్యర్ల పరిస్థితి ఇది. పవన్ అలా…

సినిమా విడుదలకు ముందు ఎలాగూ ప్రచారం చేయలేదు.  ఫ్లాప్ టాక్ వచ్చి మునిగిపోతున్న ఈ సమయంలోనైనా బయటకు రాకపోతే ఎలా? అజ్ఞాతవాసి సినిమాను కోట్లు పెట్టి కొన్న బయ్యర్ల పరిస్థితి ఇది. పవన్ అలా నడిచొస్తే చాలు కాసులు కురుస్తాయని ధీమాగా ఉన్నారు మొన్నటివరకు. ఆ పేరు చాలు కలెక్షన్లు సలాం చేస్తాయని కలలుగన్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అజ్ఞాతవాసి నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదంలో పడింది.

కేవలం పవన్ పై నమ్మకంతో ప్రమోషన్ ను లైట్ తీసుకున్నారు. పవన్ ఎలాగూ మీడియా ముందుకు రాడు. కనీసం హీరోయిన్లు, డైరక్టర్ అయినా వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తే బాగుండేది. అజ్ఞాతవాసి విడుదలకు ముందు అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. అసలు ఆ దిశగా ఆలోచించినట్టు కూడా అనిపించలేదు. అంతెందుకు, మరో 3రోజుల్లో మూవీ రిలీజ్ పెట్టుకొని, అప్పుడు ట్రయిలర్ లాంచ్ చేశారంటే, ప్రచారంపై యూనిట్ కు ఎంత శ్రద్ధ ఉందో అర్థమౌతోంది.

అజ్ఞాతవాసికి సంబంధించి అఫీషియల్ గా ఏమైనా ప్రచారం చేశారంటే అది కేవలం సిరివెన్నెల-శ్రీమణి ఇంటర్వ్యూ మాత్రమే. 'సిరివెన్నెలలో శ్రీమణి' అంటూ సాగిన ఆ ఇంటర్వ్యూ సి-సెంటర్ ఆడియన్స్ వరకు చేరనేలేదు. ఇవి కాకుండా కొడకా కోటేశ్వరరావు అనే పాటను పవన్ పాడుతున్న విజువల్స్ తో ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక పోస్టర్లు,  మూవీ స్టిల్స్  అయితే ప్రసాదం పెట్టినట్టు విడుదల చేశారు.

రిలీజ్ కు ముందంటే సినిమాపై క్రేజ్ ఉంది కాబట్టి క్యాష్ చేసుకోవచ్చని భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి భ్రమలు ఎవరికీ లేవు. విడుదలైన రెండో రోజు నుంచే ఘోరంగా పడిపోయింది సినిమా. బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా కీలకమైన సభ్యులు ప్రచారానికి ముందుకు రాకపోవడం దారుణం. 

పడిపోతున్న అజ్ఞాతవాసిని కూసింతైనా పైకి లేపాలంటే త్రివిక్రమ్, కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ లాంటి స్టార్స్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దూకాలి. కానీ యూనిట్ ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. పైగా, వెంకీ సీన్లు యాడ్ చేస్తున్నామంటూ పవన్-వెంకీతో ఓ ప్రోమో విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.